Amravati Corporation: అమరావతి కార్పొరేషన్‌పై గ్రామ సభలు.. భారీగా పోలీస్‌ బందోబస్తు!

అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు నేటితో పూర్తి కానున్నాయి.

Amravati Corporation: అమరావతి కార్పొరేషన్‌పై గ్రామ సభలు.. భారీగా పోలీస్‌ బందోబస్తు!

Grama Sabha against Amravati Corporation

Updated On : January 12, 2022 / 11:25 AM IST

Amravati Corporation: అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలు నేటితో పూర్తి కానున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలోని 19 గ్రామాలను అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నాయి గ్రామ సభలు.

రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని, క్యాపిటల్ సిటీని ముక్కలు చేస్తే తాము అంగీకరించే ప్రసక్తే లేదని, ఈ ప్రాంత రైతులు తేల్చి చెబుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 29 గ్రామాల రైతులు భూములను ఇచ్చారు.

అయితే ఏపీ ప్రభుత్వం కేవలం 19 గ్రామాలను కలుపుతూ అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటును మళ్లీ తెరమీదకు తెచ్చింది. మంగళగిరి మండలంలోని మూడు గ్రామాలు, తుళ్లూరు మండంలోని 16 గ్రామాలను కలుపుతూ ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకవచ్చింది. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు.. గతంలో ఇదే ప్రతిపాదన తీసుకచ్చినప్పడు రైతులు ఆందోళనకు దిగారు. దీనితో శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వం గ్రామ సభల నిర్వహణ ఆపేసింది.

అయితే ఇటీవల మళ్లీ గ్రామసభల ఏర్పాటు ప్రతిపాదనను తీసుకవచ్చింది. చిన్నపాటి గొడవలు మినహా గ్రామసభలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో ఓటుహక్కు వున్నవారికే గ్రామ సభలో ఓటు వేసే అవకాశం ఉందని అధికారులు తెలపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులు కొందరు తాము ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నామని తమ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో గ్రామసభల్లో గొడవలు జరిగిన దృష్ట్యా ఈసారి పెద్దఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.