వైసీపీకి ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారు: గుడివాడ అమరనాథ్

గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారని..

వైసీపీకి ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారు: గుడివాడ అమరనాథ్

Gudivada Amarnath respond on AP Assembly Election Results 2024

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ స్పందించారు. విశాఖపట్నంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తామని, సరిదిద్దుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన సంస్కరణలను, వ్యవస్థలో మార్పులను ప్రజలు అంగీకరించలేదన్న అనుమానం కలుగుతోందన్నారు.

సంస్కరణలను ప్రజలు స్వాగతించలేకపోయారా?
ప్రభుత్వాన్నే ప్రజల కాళ్ల దగ్గరకు తీసుకురావడాన్ని ప్రజలు అంగీకరించలేదా? ప్రతి పథకాన్ని గడప దగ్గరకు తీసుకురావడాన్ని ప్రజలు స్వాగతించలేకపోయారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని, సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగ కల్పన చేశామని గుర్తుచేశారు. ఇంత పెద్ద ఎత్తున చేసిన సంస్కరణలను ప్రజలు స్వాగతించలేకపోయారా? లేదా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయాలని ఆశించారా? లాంటి ప్రశ్నలు తమ పార్టీకి ఉన్నాయన్నారు. వీటన్నింటికి సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం తమ మీద ఉందన్నారు.

Also Read: జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు.. చరిత్ర సృష్టించిన రాజకీయ అపర చాణక్యుడు

ప్రమాణస్వీకారం చేయకముందే దాడులా?
గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీకి ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారని.. ప్రజాస్వామ్యానికి ఇది ఏరకమైన మెసేజ్ ఇస్తుందన్నది ఆలోచించాలన్నారు. వారు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఈ పరిస్థితి ఉందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమని.. ఓడిపోయిన వారు బలహీనులు కాదు, గెలిచినవారు బలవంతులు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్ట్ కాదని.. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని గుడివాడ అమరనాథ్ అన్నారు.

Also Read: నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదు: జక్కంపూడి రాజా ఆవేదన

వైసీపీ కార్యకర్తలను పట్టించుకోలేకపోయాం..
ప్రజలనుకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి సమయం ఇస్తామని, రేపే అన్ని చేయాలని పట్టుబట్టే అమాయకత్వం తమకు లేదన్నారు. ప్రజలు ఏ హామీలను నమ్మి ఓటు వేశారో వాటి అమలులో లోటుపాట్లు జరిగితే కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు. వైసీపీ కార్యకర్తలకు తగిన గౌరవం ఇవ్వకలేకపోయామని, నిర్లక్ష్యం చేశామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాజువాక అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని, ప్రజావ్యతిరేక కార్యక్రమాల్లో పోరాటం చేస్తామన్నారు.