తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వద్దు: హర్షకుమార్
తెలంగాణకు చెందిన వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించొద్దని అధిష్టానాన్ని కోరారు హర్షకుమార్. ఆమె కంటే సమర్థులైన నాయకులు ఏపీలో లేరా అని ప్రశ్నించారాయన.

gv harsha kumar oppose to give pcc post to ys sharmila
GV Harsha Kumar on YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, యువనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం పార్టీ గూటికి చేరారు. బేషరతుగా కాంగ్రెస్ లో చేరానని, తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆమె తెలిపారు. కాగా, షర్మిలకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు పీసీసీ పగ్గాలు ఇవ్వొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.
జగన్‌ను గద్దె దించుతాం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించవద్దని, ఇక్కడ ఎవరూ నాయకులు లేరా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చెల్లని నాణెం, ఏపీలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. షర్మిలకు ఏఐసీసీ పదవి ఇచ్చి, స్టార్ క్యాంపెనర్ గా ఆమె సేవలు దేశవ్యాప్తంగా వాడుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచే ఎంపీగా తాను పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. ఏ దళితులైతే గద్దెనెక్కించారో ఇప్పుడు ఆ దళితులే జగన్ ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహ గర్జన నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
షర్మిలకు పదవిపై ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆమెకు ఏ పదవి ఇస్తారనే దానిపై ఏపీ కాంగ్రెస్ నాయకులతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏపీలో పార్టీని మళ్లీ ఉత్తేజపరచాలంటే షర్మిలకు పగ్గాలు అప్పగించాలని ఆమె మద్దతుదారులు కోరుతుండగా, హర్షకుమార్ లాంటి సీనియర్ నాయకులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు మాత్రం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్‌తో భేటీ అయ్యారు.
Also Read: రాజమండ్రిలో ప్రత్యక్షమైన లగడపాటి రాజగోపాల్.. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్‌తో భేటీ