రాజమండ్రిలో ప్రత్యక్షమైన లగడపాటి.. ఉండవల్లి, హర్షకుమార్‌తో భేటీ

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

రాజమండ్రిలో ప్రత్యక్షమైన లగడపాటి.. ఉండవల్లి, హర్షకుమార్‌తో భేటీ

Lagadapati Rajagopal meet gv harsha kumar

Updated On : January 11, 2024 / 3:44 PM IST

Lagadapati Rajagopal : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, హర్షకుమార్ 2004, 2009లో అమలాపురం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిథ్యం వహించారు.

హర్షకుమార్ ను కలిసిన తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లారు లగడపాటి రాజగోపాల్. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో హర్షకుమార్, ఉండవల్లితో లగడపాటి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి కలయిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: పెనుకొండలో ఇద్దరు మహిళల మధ్య ఆసక్తికర పోరు.. గెలిచేదెవరు?

కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వీడిపోయిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరమయ్యారు. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఈ పదేళ్లలో చాలా తక్కువగా ఆయన మీడియాలో కనబడ్డారు. వైఎస్ షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో లగడపాటి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే తాను మళ్లీ రాజకీయాల్లోకి రావడం లేదని లగడపాటి రాజగోపాల్ తేల్చిచెప్పారు.

మళ్లీ రాజకీయాల్లోకి రావాలని లేదు: లగడపాటి
కాకినాడలో శుభకార్యానికి వెళుతూ మార్గమధ్యలో మర్యాదపూర్వకంగా హర్షకుమార్, ఉండవల్లిని కలిసినట్టు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు తాము పూర్తిగా విభేదించామని గుర్తు చేశారు. ప్రజల కోసం తమ భవిష్యత్తును లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టామని చెప్పారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని.. ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ కి మద్దతు ఇస్తానని తెలిపారు. వీరిద్దరూ ఎక్కడి నుంచి పోటీ చేసినా వారి తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. గతంలో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉందన్నారు. తనకు రాజకీయంగా పుట్టుకనిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని లడగపాటి వ్యాఖ్యానించారు.