ఏపీలో 2 లక్షల ఎకరాల పంట నష్టం..రైతుల కన్నీరుమున్నీరు

  • Published By: madhu ,Published On : October 15, 2020 / 01:16 PM IST
ఏపీలో 2 లక్షల ఎకరాల పంట నష్టం..రైతుల కన్నీరుమున్నీరు

Updated On : October 15, 2020 / 1:27 PM IST

Heavy Rain Fall In Andhrapradesh : ఏపీలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీవ్ర వాయుగుండం ఆరు జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు చేతికందిన పంట నీటమునిగి అన్నదాత గుండె చెరువయ్యింది. కుండపోత వానలతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు ఇంకా నీటమునిగే ఉన్నాయి.




వరదనీరు బయటికి పోయే కొద్దీ నష్టం ఇంకా పెరగనుంది. ఆరుగాలం పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి వానదేవుడు అంతా ఊడ్చిపెట్టేశాడని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వ్యవసాయ పంటలు 1. లక్షా 79వేల ఎకరాలు ఉండగా.. ఉద్యాన పంటలు 23 వేల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.




కడప జిల్లాలో 1190 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లు గుర్తించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వానలతో గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల మెట్ట పైర్లలో నీరు నిలిచే ఉంది. కృష్ణా నదికి వరద పెరుగుతుండటంతో కొన్నిచోట్ల ఇంకా ముంపు భయం పొంచి ఉంది.




వరితోపాటు పత్తి, మిరప, మొక్కజొన్న, మినుముసహా పలు పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిచింది. మొక్కజొన్న, మొలకలు వచ్చింది. మిరప నీటిలో నానుతోంది. మినుము చేతికొచ్చే పరిస్థితి లేదనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. పత్తి కాపు నేల రాలిపోవడంతోపాటు కాయలు కుళ్లిపోతున్నాయి.