తగ్గిన ఉష్ణోగ్రతలు…ఇక వరుణుడి వంతు

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2019 / 03:07 AM IST
తగ్గిన ఉష్ణోగ్రతలు…ఇక వరుణుడి వంతు

Updated On : May 14, 2019 / 3:07 AM IST

కొన్ని రోజులుగా నిప్పులు కక్కుతున్న భానుడు కాస్త శాంతించాడు. మరో రెండు, మూడు రోజులు ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాడు. అయితే అకాల వర్షాల రూపంలో వరుణుడు పిడుగుల వర్షాన్ని కురిపించనున్నాడు. తెలంగాణ నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రెండు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తాంధ్రలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఆయా ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం పలుచోట్ల దాదాపు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు మాత్రమే ఎక్కువ. ఇదిలావుండగా.. సోమవారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు.