6 రోజుల్లో రూ.1100 కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్

ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఈ స్టాక్ భారీ రిటర్న్స్ ఇస్తోంది. మే 31న 404 రూపాయలుగా ఉన్న ఈ స్టాక్.. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి 695 రూపాయలకు పెరిగింది.

6 రోజుల్లో రూ.1100 కోట్లు.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్

Heritage Foods Stock : నారా చంద్రబాబు కుటుంబం ప్రమోట్ చేస్తున్న హెరిటేజ్ ఫుడ్స్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆకాశమే హద్దుగా ఎగబాకుతున్న హెరిటేజ్ ఫుడ్స్ .. కేవలం 6 ట్రేడింగ్ సెషన్స్ లోనే 70శాతం పైగా పెరిగి రిటైల్ ఇన్వెస్టర్లను ఖుషీ చేస్తోంది. రిజల్ట్స్ ప్రకటన తర్వాత.. ఈ స్టాక్ ను పట్టుకునేందుకు ఇన్వెస్టర్లు ఎంతగానో ప్రయత్నించారు. దీంతో ఈ స్టాక్ అప్పటి నుంచి పైపైకి చూస్తోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన 20 నిమిషంలోనే ఈ స్టాక్ 727కు పెరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడంతో ఈ స్టాక్ చివరకు 5శాతం పైగా లాభంతో 695 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే 6వేల 450 కోట్లకు పెరిగింది. మరోవైపు ఈ కంపెనీలో వాటా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, తొమ్మిదేళ్ల మనవడు దేవాన్ష్ సంపద కేవలం 6రోజుల్లో కోటి 70లక్షల రూపాయలు పెరిగింది. ఈ కంపెనీలో దేవాన్ష్ కు 0.06 శాతం వాటా.

1992లో ప్రారంభమైన హెరిటేజ్ ఫుడ్స్ లో చంద్రబాబు కుటుంబానికి మొత్తం 35.7 శాతం వాటా ఉంది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి ఈ కంపెనీలో 24.37శాతం వాటా, నారా లోకేశ్ కు 10.82శాతం వాటా, నారా బ్రాహ్మణికి 0.46శాతం వాటా ఉంది. గత 6 రోజుల్లో చంద్రబాబు కుటుంబానికి మొత్తం చూసుకుంటే 1100 కోట్లకు పైగా సంపద పెరిగింది.

ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపడుతుండటంతో ఈ స్టాక్ లో అనూహ్య ర్యాలీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ప్రకటన తర్వాత ఈ స్టాక్ భారీ రిటర్న్స్ ఇస్తోంది. మే 31న 404 రూపాయలుగా ఉన్న ఈ స్టాక్.. సోమవారం ట్రేడింగ్ ముగిసేసరికి 695 రూపాయలకు పెరిగింది. అంటే వారం రోజుల్లో హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ 70శాతం ఎగబాకింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మే 13న రూ.354గా ఉన్న ఈ స్టాక్.. తాజాగా రెట్టింపు స్థాయిలో పెరిగినట్లు అయ్యింది. ఏప్రిల్ 8న 304 రూపాయల వద్ద కదలాడిన హెరిటేజ్ ఫుడ్స్.. ఎన్డీయేతో టీడీపీ పొత్తు కుదురటంతో స్టాక్స్ లో అనూహ్య ర్యాలీ వచ్చింది.

మే 13.. అంటే ఎన్నికలు జరిగిన రోజు వరకు ఈ స్టాక్ నిలకడగా కదలాడి రూ.362కు చేరింది. ఎన్నికలు పూర్తయ్యాక ఈ స్టాక్ వెనుదిరిగి చూడలేదు. వరుస ర్యాలీతో ఈ స్టాక్ ఫుల్ జోష్ ఇచ్చింది. ఇక, హెరిటేజ్ ఫుడ్స్ గత ప్రదర్శన చూస్తే 2017 డిసెంబర్ లో ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 899 రూపాయలకు చేరింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత నేల చూపులు చూసింది. గతేడాది మార్చి 6న ఈ స్టాక్ రూ.138 కనిష్టానికి పడిపోయింది. ఆ తర్వాత ఈ స్టాక్ లో ఓ మోస్తరు ప్రదర్శన కొనసాగింది. ఇన్వెస్టర్స్ లో ఉత్సాహం నింపేందుకు గతేడాది ఆగస్టులో కంపెనీ డివిడెండ్ ను కూడా ప్రకటించింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావొచ్చనే అంచనాలతో గతేడాది కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ స్టాక్ 229 శాతం పెరిగి, ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచింది.

గత 20 రోజులుగా హెరిటేజ్ ఫుడ్స్ లో రోజుకు సగటున 34 లక్షల స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. అయితే, ఏపీలో టీడీపీ కూటమి విజయదుంధుబి మోగించడంతో ఈ స్టాక్స్ లో వాల్యూమ్స్ కూడా అమాంతం పెరిగాయి. సోమవారం 2కోట్లకు పైగా షేర్లు ట్రేడ్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ స్టాక్ లో స్ట్రాంగ్ మూమెంటం ఉందని.. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ ను పరిశీలించ వచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, గత త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు హెరిటేజ్ ఫుడ్స్ లో తమ వాటాను గణనీయంగా తగ్గించుకోవడం ఈ స్టాక్ బలహీనతగా చెప్పొచ్చని మరికొందరు ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.

Also Read : ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం..! చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత పనులు వేగవంతం