ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం..! చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత పనులు వేగవంతం

ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి.

ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం..! చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత పనులు వేగవంతం

Ap Capital Amaravati : అమరావతికి మళ్లీ పూర్వ వైభవం రానుంది. రాజధానిలో నిలిచిపోయిన పనులకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. ఐదేళ్లుగా అతీగతి లేని ప్రజా రాజధాని మళ్లీ కళకళలాడబోతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే పనులు మొదలైనప్పటికీ.. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శరవేగంగా జరగనున్నాయి. అమరావతిలో నిర్మాణాలు, పెండింగ్ పనులపై 10టీవీ గ్రౌండ్ రిపోర్ట్..

ఐదున్నర కోట్ల రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధానులను తలదన్నేలా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం తలపించింది. ఇందుకోసం అన్ని స్థాయిల్లో ఉన్న నిపుణులు అమరావతిని సందర్శించి పరిశీలించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని చూశారు. ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధాని నగరాలను తలదన్నే విధంగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మాణం చేయాలని సంక్పలించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, నవ్యాంధ్రకు చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

గడిచిన ఐదేళ్లుగా ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారింది. పిచ్చి చెట్లతో నిండిపోయింది. అడవిని తలపించేలా తయారైన ఈ ప్రాంతం మరోసారి కళకళలాడబోతోంది. పూర్తి స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. అమరావతి పారిశ్రామిక కేంద్రాలపై దృష్టి సారించడం, ఇంధన సమర్థవంతమైన హరిత నగరంగా తీర్చిదిద్దడం, ప్రపంచ స్థాయి నగరాలకు పోటీపడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో సీఆర్డీఏ విస్తరించింది. దాదాపు 8వేల 352.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అమరావతి రాజధాని ప్రాంతం మరొకసారి కళకళలాడబోతోంది. రాజధాని నిర్మాణం, మిగతా అంశాలన్నీ పూర్తి చేయడానికి కార్యచరణ రూపొందిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశాక రాజధాని ప్రాంతంలో అభివృద్ది పనులు మరింత వేగం అందుకోనున్నాయి.

* 2017 అక్టోబర్ 22న అమరావతి రాజధానికి శంకుస్థాపన
* ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
* ఏపీ ప్రభుత్వం మారటంతో నిలిచిపోయిన పనులు
* అమరావతిని పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు సంకల్పం
* చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత పనులు వేగవంతం
* నిలిచిపోయిన నిర్మాణాల పటిష్టతపై నిపుణులతో సర్వే

Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..! మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..