హద్దు మీరిన రాజకీయం, ఎప్పుడేం జరుగుతుందోనని కృష్ణా జిల్లాలో టెన్షన్ టెన్షన్

సార్వత్రిక ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు ఆత్రం ఆగడం లేదు. జిల్లాలోని అధికార, ప్రతిపక్షంలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏదో మామూలు విమర్శలు చేసుకున్నా బాగానే ఉంటుందేమో కానీ… అంతకు మించి తమ భాషా పరిజ్ఞానాన్ని చూపిస్తున్నారు. వీధి పోరాటాలకు సైతం వెనుకాడేది లేదనే సంకేతాలిస్తున్నారు. అధికార పార్టీ నేతలు అంతా ఏకమై ప్రతిపక్ష నేతల మీద దాడి చేస్తున్నారు. దీంతో ప్రతిపక్ష నేతలు ఆత్మరక్షణలో పడుతున్నారు. వీరి మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని జనాలు కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఇదంతా వాళ్లకు అలవాటైనా తంతే అయినా ఇంతకు ముందు కంటే జోరు ఎక్కువ కావడంతో ఆందోళన కనిపిస్తోంది.
నాని, ఉమ మధ్య వ్యక్తిగత దూషణలు:
ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. వీరి మధ్య వివాదాలలో కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు. కృష్ణా జిల్లాలో మొదటిగా దేవినేని ఉమ.. కొడాలి నానితో మొదలైన వివాదాలు ఇప్పుడు పలు నియోజకవర్గాలకు పాకాయి. మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
మైలవరం నియోజకవర్గంలో టెన్షన్ టెన్షన్:
నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతలు ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు. దీనంతటికీ కారణం వసంత కృష్ణప్రసాద్‌పై కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ ఆరోపణలు, పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి అంటూ దేవినేని చేసిన ఆరోపణలే. ఈ అవినీతిపై బహిరంగ చర్చ అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలైన మరుక్షణం నుంచి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
నిత్యం ప్రశాంతంగా ఉండే మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు:
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉద్రిక్తంగా తయారైంది. మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలకు సౌమ్యులుగా పేరుంది. అయినా ఈ నియోజకవర్గంలో రాజకీయ హత్యలు జరిగాయి. దీంతో ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేత మోక భాస్కర్‌రావు హత్య జరగడం, ఆ కేసులో ఎ-4గా కొల్లు రవీంద్ర అరెస్టయి జైలుకి వెళ్లి, ఈ మధ్యనే బెయిలుపై బయటకు వచ్చారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.
పెనమలూరు నియోజకవర్గంలోనూ సేమ్ సీన్:
పెనమలూరు నియోజకవర్గంలో కూడా ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. దీనికి పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూముల కోనుగోళ్లలో జరిగిన అక్రమాలే కారణంగా చెబుతున్నారు. పార్థసారథి మొత్తం 150 కోట్ల రూపాయల అవినీతి చేశారని ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.
నందిగామ నియోజకవర్గంలో గొడవలు:
ఇక నందిగామ నియోజకవర్గం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలైన మూడో రోజు నుంచే అక్కడ వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గొడవలను ప్రోత్సహించరని పేరుంది. అక్కడ దేవినేని ఉమ ఆధిపత్యం ఉండటమే గొడవలకు కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే నాలుగింటిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎఫెక్ట్ జిల్లా మొత్తం పడుతోందని అంటున్నారు.
వైసీపీ నేతల అందరి లక్ష్యం ఆయనే:
అధికార పార్టీలో విమర్శలు చేసే అందరి లక్ష్యం దేవినేని ఉమనే. గత ఐదేళ్లు మంత్రిగా పని చేయటం, రోజు ముఖ్యమంత్రిని, వైసీపీని తీవ్ర స్దాయిలో విమర్శలు చేయటం వల్ల ఉమను అధికార పార్టీ అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదని చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అందరూ కలిసి ఐక్యంగా ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఓటమి తర్వాత ఆ పార్టీలో నైరాశ్యం కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో కేడర్, మరికొన్ని చోట్ల నేతలు పార్టీని పట్టించుకోవటం లేదు.
చంద్రబాబు, ఉమకు అండగా నిలవని తెలుగు తమ్ముళ్లు:
జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న దేవినేని ఉమ, పార్టీ అధినేత చంద్రబాబుపై ఈ స్థాయిలో దాడి జరుగుతుంటే కృష్ణా జిల్లా నుంచి ఏ నేత కూడా అండగా నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఎంపీ కేశినేని నాని విజయవాడ సిటీకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ట్విటర్‌లో స్పందిస్తుంటారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వివాదాలకు దూరంగా ఉంటారు. వర్ల రామయ్య కొంత వరకు ఓకే. బోండా ఉమా ఈ అంశంలో జోక్యం చేసుకోవటం లేదు. దూకుడుగా ఉండే బుద్ధా వెంకన్న అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు.
ఒక పక్క అధికార పక్షం అంతా ఏకమై వాయించేస్తూ ఉంటే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు మాత్రం సైడ్ అయిపోతున్నారట. కేడర్ మాత్రం జరుగుతున్న పరిణామాలు, తమ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న దాడిని నాయకులంతా కలిసి ఎదుర్కోకపోతే 2024 ఎన్నికల నాటికి ప్రజలలో నమ్మకం కలగదని వాపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. పరస్పర తిట్ల పురాణంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని గ్రహించైనా రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.