ఊరెళ్లి పోతామయ్యా.. జర జాలిచూపండయ్యా.. బ్యాచిలర్ల కష్టాలు!

కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. సామాజిక దూరం పాటించాలని, అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ ఇంట్లోనుంచి బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బ్యాచిలర్ల కష్టాలు మొదలయ్యాయి.
నగరంలోని అమీర్‌పేట, పంజాగుట్ట సహా అన్ని ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్న యువతీయువకుల నానా అవస్థలు పడుతున్నాయి. హాస్టళ్ల నిర్వాహకులు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా చెప్పడంతో అటు సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కడే తలదాచుకోలేక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.
ఎక్కడికెక్కడ ప్రజా రవాణా కూడా నిలిపివేయడంతో సొంతూళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. హాస్టళ్ల నుంచి తరిమియేడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలంటూ హాస్టళ్లలో ఉండే యువతీ యువకులంతా ఆందోళనకు దిగారు. పంజాగుట్టా పోలీసు స్టేషన్ దగ్గర ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు దిగొచ్చారు. ఎలాంటి ఆటంకం లేకుండా స్వంత గ్రామాలకు వెళ్లేందుకు పోలీసులు ఎన్ఓసీలు జారీ చేశారు.
మూడు వారాల పాటు దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హాస్టళ్లను ఖాళీ చేయాలంటూ అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లోని హాస్టళ్ల యజమానులు యువతీయువకులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కూకట్ పల్లిలో కిలోమీటర్ల మేర విద్యార్ధులు క్యూలో నిలబడ్డారు. బస్సులు, రైళ్లు అన్నీ బంద్ కావడంతో ఎటు వెళ్లలేకపోతున్నారు.
కరోనా వైరస్ ప్రభావంతో నగర ప్రాంతాల్లో హాస్టల్స్‌ని కూడా ఖాళీ చేయిస్తున్నారు. విద్యార్ధులు ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. చాలా మంది సొంత ఊళ్లకు ఎలా వెళ్లాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడిక్కడ పోలీసులు చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎటు వెళ్ళాలో అర్ధం కావడం లేదు. చాలా మంది నగరాలలోనే ఉండిపోతున్నారు.
హైదరాబాద్ సహా విశాఖ విజయవాడ నగరాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన ఎందరో విద్యార్ధులు చదువు కోసం వచ్చినవారు ఉన్నారు. ఇప్పుడు సొంత ఊళ్లకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశాలు లేవు. అది ఇంకా పొడిగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో సొంత ఊళ్లకు వెళ్ళడానికి విద్యార్ధులు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు.
రోడ్డు మీదకు వస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు సొంత ఊళ్లకు వెళ్ళడానికి వెసులుబాటు కల్పించారు. కారు లేదా బండి మీద వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తమ వద్దకు రావాలని కారు నెంబర్, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇతరత్రా తీసుకుని వాళ్లకు ఒక పేపర్ ఇస్తారు. దానిలో అనుమతిస్తున్నట్టు రాసి ఇస్తారు.
అప్పుడు ఇక ఎవరు ఆపినా సరే దానిని వాడుకునే అవకాశం ఉంటుంది. దాని కాల పరిమితి కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చబౌలి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. పోలీసులు కూడా ఈ సమస్యపై గందరగోళంలో ఉన్నారు. వీరిని సొంత ఊర్లకు ఎలా పంపించాలనే అంశంపై ఫోకస్ పెట్టారు.. అధికారులతో చర్చిస్తున్నారు.