Fire Accident : హెచ్.పి.సి.ఎల్ అగ్నిప్రమాదంపై విచారణ పూర్తి
విశాఖపట్టణంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ పూర్తయ్యింది. ప్రమాదంపై పది మంది సభ్యులుతో కూడిన కమిటీ విచారణ చేసింది.

Vizag
HPCL : విశాఖపట్టణంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ పూర్తయ్యింది. ప్రమాదంపై పది మంది సభ్యులుతో కూడిన కమిటీ విచారణ చేసింది. పైపులైన్ దెబ్బతినడం వల్లే…అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. లోపలి భాగంలో తుప్పు పట్టడంతో పైపు బలహీనంగా తయారైందని, ఈ లోపాన్ని రిఫైనరీ సిబ్బంది గుర్తించలేకపోయారని వెల్లడించింది.
అగ్నిప్రమాదం వల్ల మరో మూడు పైపులైన్లు కొంతమేర దెబ్బతిన్నాయని గుర్తించారు. ప్రమాదం కారణంగా..78 టన్నుల ముడి చమురు, బిటుమిన్, నాప్తా వృథా అయ్యిందని తెలిపింది. వేగంగా స్పందించడం, హుటాహుటిన చర్యలు చేపట్టడం, ఆటోమేషన్ వ్యవస్థలన్నీ సక్రమంగా పని చేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రమాదానికి సంబంధించిన తుది నివేదికను రెండు మూడు రోజుల్లో కలెక్టర్ కు కమిటీ సభ్యులు అందచేయనున్నారు.
విశాఖ పారిశ్రామికవాడలోని హిందూస్ధాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ కు చెందిన ఓల్డ్ టెర్మినల్ లో 2021, మే 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనతో సమీపంలోని ఉన్న గాజువాక ఆటోనగర్ ప్రాంతం, మల్కాపురం, శ్రీహరిపురంలోని ప్రజలు భయాందోళనలతో ఇళ్లనుంచి బయటకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న మల్కాపురం పోలీసులతో సహా పారిశ్రామికవాడలోని పలు ఫైరింజన్లు అక్కడకు చేరుకున్నాయి. దాదాపు గంటన్నర పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. హెచ్.పి.సి.ఎల్. కు సంబంధించి విశాఖపట్నంలో ఆరు రిఫైనరీలు ఉన్నాయి.
Read More : Corona Vaccine : గ్రేటర్ హైదరాబాద్‌లో సూపర్ స్ప్రెడర్స్‌కు టీకాలు