Sahithi Pharma Company : ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. ఇంకా అదుపులోకి రాని మంటలు
Sahithi Pharma Company : మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Sahithi Pharma Company (Photo : Google)
Sahithi Pharma Company Blast : అనకాపల్లి జిల్లా సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో కంపెనీ లోపల మొత్తం 35మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 28మంది కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు.
ప్రమాదం జరిగి 5 గంటలు అయినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రెండు రియాక్టర్లలో పేలుడు సంభవించడంతో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సాల్వెంట్ ను ఒక లారీలోకి ఎక్కిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.
ఈ సాల్వెంట్ కు మండే స్వభావం అధికంగా ఉంటుంది. మంటలు అదుపులోకి రాకపోవడానికి అదే కారణం అని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ దగ్గరికి వెళ్లారు. ప్రమాదం ఎలా జరిగింది? అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏడుగురు కార్మికులు చికిత్స పొందుతున్నారు. వీరందరికి దాదాపు 75శాతం గాయాలయ్యాయి.
అగ్నిప్రమాదంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫార్మా సిటీలో తరుచుగా ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తున్న అంశం. దీని వెనుక అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం, పరిశ్రమల శాఖ అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.