Vijayawada : చిట్టీలు కడుతున్నారా? బీకేర్ ఫుల్.. విజయవాడలో భారీ మోసం, రూ.5కోట్లకు టోకరా

రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేస్తే అప్పలనాయుడు నిండా ముంచేశాడని బాధితులు వాపోయారు Vijayawada Chit Fund Fraud

Vijayawada : చిట్టీలు కడుతున్నారా? బీకేర్ ఫుల్.. విజయవాడలో భారీ మోసం, రూ.5కోట్లకు టోకరా

Vijayawada Chit Fund Fruad

Vijayawada Chit Fund Fraud : చిట్టీల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. చిట్టీల పేరుతో లక్షల రూపాయలు కట్టించుకోవడం.. ఆ డబ్బు తీసుకుని పరార్ అవడం కామన్ గా మారిపోయింది. తాజాగా విజయవాడ భాను నగర్ లో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది.

పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తి రూ.5కోట్లకు జనాలకు టోకరా వేశాడు. మొత్తం 300 మంది బాధితులు రోడ్డునపడ్డారు. తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా పోయిందని కన్నీటిపర్యంతం అవుతున్నారు. తమ డబ్బు తమకు ఇప్పించి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేస్తే అప్పలనాయుడు నిండా ముంచేశాడని బాధితులు వాపోయారు. అప్పలనాయుడు 30ఏళ్లుగా భాను నగర్ లో నివాసం ఉంటున్నాడు. బిల్డింగ్ లు, అపార్ట్ మెంట్లు కట్టించాడు. స్థానికుల దగ్గర బాగా నమ్మకం సంపాదించాడు. చిట్టిలు వేయడం స్టార్ట్ చేశాడు. పావలా వడ్డీ ఇస్తానని ఆశ కల్పించాడు.

Also Read..Assam: ఫేస్‌బుక్ ప్రేమ.. మూడేళ్ల తరువాత భార్య, ఆమె తల్లిదండ్రులను హత్యచేసిన భర్త .. అసలేం జరిగిందంటే?

30ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్న వ్యక్తి కావడంతో స్థానికులు అతడిని నమ్మారు. చిట్టీలు వేశారు. కొందరు 5లక్షలు, మరికొందరు 7లక్షలు, ఇంకొందరు 8 లక్షలు చిట్టీలు వేశారు. అయితే, అప్పలనాయుడు మోసం చేశాడు. అలా కట్టించుకున్న డబ్బుతో ఎస్కేప్ అయ్యాడు. 300 మంది బాధితులకు ఐపీ నోటీసులు పంపాడు. నోటీసులు చూసుకుని చిట్టీలు కట్టిన వారంతా షాక్ కి గురయ్యారు. దీని గురించి అడిగేందుకు అప్పలనాయుడు ఇంటికి వెళ్తే అతడు పారిపోయాడని తెలిసి లబోదిబోమన్నారు.

Also Read..Andhra Pradesh: బాలికలు, మహిళల మిస్సింగ్‌పై సంచలన విషయాలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

అప్పలనాయుడిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అప్పలనాయుడికి వంత పాడుతున్నారని ఆరోపించారు. అప్పలనాయుడు పేరుతో భూములు ఉన్నాయని, వాటిని అమ్మి ఆ డబ్బు తమకు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. చిట్టీల డబ్బు నెల రోజుల్లో ఇస్తానని చెప్పిన వ్యక్తి.. 20 రోజులుగా కనిపించడం లేదన్నారు. తామంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారమని, రూపాయి రూపాయి కూడబెట్టి కుటుంబసభ్యులకు ఏదైనా ఉపయోగపడుతుందని చిట్టీ కడితే అప్పలనాయుడు తమను నిండా ముంచేశాడని విలపించారు.