Lakshmi Parvathi : నేను ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకున్నా- రాష్ట్రపతికి లేఖ రాసిన నందమూరి లక్ష్మీపార్వతి
నేను ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్నానని లేఖలో వెల్లడించారు. 1994 ఎన్నికల్లో తన భర్త ఎన్టీఆర్ తో పాటు ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. Lakshmi Parvathi - NTR

Lakshmi Parvathi - NTR (Photo : Google)
Lakshmi Parvathi – NTR : నందమూరి లక్ష్మీపార్వతి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ నెల 28న రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నాణెం విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి తో పాటు NTR కుటుంబసభ్యులకు ఆహ్వానం పంపారు. కాగా, కార్యక్రమానికి ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చాలని లేఖలో రాష్ట్రపతిని కోరారు లక్ష్మీపార్వతి. నేను ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్నానని ఆమె లేఖలో వెల్లడించారు. 1994 ఎన్నికల్లో తన భర్త ఎన్టీఆర్ తో పాటు ఉన్నానని లేఖలో పేర్కొన్నారు లక్ష్మీపార్వతి.
ఎన్టీఆర్‌తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబసభ్యుల కుట్రలు వంటి అంశాలను సైతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించారు లక్ష్మీపార్వతి. ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో కూడిన రూ. 100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. ఆగస్టు 28న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో హాజరుకావాలని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కేంద్రం సమాచారం అందించింది.
రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఎన్టీఆర్ రూ.100 నాణేం ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ మేరకు ఆయన ఈనెల 27న ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 28న ఎన్టీఆర్ చిత్రంతో కూడిన రూ.100 నాణేం విడుదల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న పలువురు సీనియర్ నేతలకు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం అందింది. అయితే, తనకు మాత్రం ఆహ్వానం అందకపోవడం పట్ల లక్ష్మీపార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం పంపాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు.