Kesineni Brothers: లోకేశ్ పాదయాత్రకు దూరంగా అన్నయ్య.. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసిన తమ్ముడు!

అన్నపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న తమ్ముడు.. అదును చూసి తన సత్తా ఏంటో నిరూపించుకోగలిగారా? బెజవాడలో ఏం జరిగింది..?

Kesineni Brothers: లోకేశ్ పాదయాత్రకు దూరంగా అన్నయ్య.. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసిన తమ్ముడు!

TDP got clarity on the Kesineni brothers dispute

Kesineni brothers dispute: కేశినేని బ్రదర్స్ వివాదంపై టీడీపీకి క్లారిటీ వచ్చేసిందా? ఇన్నాళ్లు ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరిని ప్రోత్సహించాలో.. ఎవరిని పక్కకు పెట్టాలో తేల్చుకోలేని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విజయవాడలోని యువగళం (Yuvagalam) పాదయాత్ర తర్వాత తుదినిర్ణయానికి వచ్చేశారా? యువనేత లోకేశ్‌ (Nara Lokesh) పాదయాత్రకు సిట్టింగ్ ఎంపీ నాని దూరంగా ఉండిపోడానికి కారణమేంటి? అన్నపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న తమ్ముడు.. అదును చూసి తన సత్తా ఏంటో నిరూపించుకోగలిగారా? బెజవాడలో (Bezawada) ఏం జరిగింది..? ఇకపై ఏం జరగనుంది?

తీవ్ర అసంతృప్తితో కేశినేని నాని
ఏపీలో బెజవాడ రాజకీయం ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటోంది. వైసీపీ హవాలోనూ టీడీపీ గెలిచిన మూడు ఎంపీ సీట్లలో బెజవాడ ఒకటి. అంతేకాదు సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వరుసగా రెండుసార్లు గెలిచారు. అధినేత చంద్రబాబుకు ఎంతో దగ్గరగా ఉంటూ.. పార్టీలో పూర్తి పట్టు సాధించిన ఎంపీ కేశినేని నాని.. కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు తన ఆగ్రహాన్ని.. అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ అధినేత చంద్రబాబు వరకు వచ్చేసరికి ఎంతో జాగ్రత్తగా.. ఆచితూచి మాట్లాడుతున్నారు. బెజవాడలో ఇతర టీడీపీ నేతలకు దూరంగా ఉంటూనే.. అన్నమయ్య జిల్లాలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని ఖండించారు. కేంద్రానికి స్వయంగా లేఖరాసి నిరసన తెలియజేశారు. ఇటు బెజవాడ వరకు వచ్చేసరికి మిగిలిన నాయకులకు మింగుడుపడని విధంగా వ్యవహరిస్తున్న నాని.. పార్టీ ప్రతిష్ట.. అధినేత వ్యవహారం వరకు వచ్చేసరికి అనుకూలంగా ఉంటుండటంతో ఆయన రాజకీయం అర్థం చేసుకోలేపోయింది టీడీపీ.

అదును కోసం వేచిచూసిన కేశినేని చిన్ని
ఇదే సమయంలో ఎంపీ కేశినేని నానికి పోటీగా.. ఆయన సొంత సోదరుడు కేశినేని చిన్ని వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తుండటంతో ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతోంది టీడీపీ. ఇటు నాని వైఖరి.. అటు కష్టకాలంలో పార్టీని నడిపిస్తున్న చిన్ని సమర్థత మధ్య నలిగిపోయారు చంద్రబాబు. ఈ ఇద్దరిని నచ్చజెప్పడం ఎలానో అర్థం కాక.. చంద్రబాబే వీరి విషయంలో వేచిచూసే వైఖరిని అనుసరించారు. ఐతే ఇప్పుడు ఈ అన్నదమ్ముల పోటీలో చిన్నోడు కేశినేని చిన్ని ఒక్కసారిగా దూసుకొచ్చారు. అప్పుడప్పుడు ప్రకటనలు.. కార్యక్రమాలతో పార్టీని ఎంపీ నాని కన్ఫీజ్ చేస్తుండటంతో అదును కోసం వేచిచూసిన కేశినేని చిన్ని.. లోకేశ్ యువగళం పాదయాత్రను చక్కగా వినియోగించుకున్నారు. విజయవాడ నగరంలో జరిగిన లోకేశ్ పాదయాత్రకు టీడీపీ క్యాడర్ మొత్తం తరలివచ్చినా సిట్టింగ్ ఎంపీ నాని గైర్హాజరుతో అన్నదమ్ముల పోటీపై ఓ నిర్ణయానికి వచ్చేసింది టీడీపీ.

Also Read: లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసిన చిన్ని
అహ్వానం అందలేదన్న కారణంతో ఎంపీ నాని.. యువగళానికి దూరంగా ఉండటంతో ఆయన సోదరుడు చిన్ని మొత్తం బాధ్యతలు నెత్తిన వేసుకున్నారు. లోకేశ్ బెజవాడలో అడుగుపెట్టిన నుంచి ముందుండి నడిపించారు. పార్టీలో ఎలాంటి పదవులు అనుభవించకపోయినా.. ఇతర పెద్ద నేతలు ఎంతో మంది ఉన్నా.. మొత్తం తానై నడిపించి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేశారు చిన్ని. ఇదే సమయంలో ఎంపీ నానిని తప్పించే విషయంలో టీడీపీకి కూడా సరైన కారణం దొరికినట్లైంది.

Also Read: నిన్ను డ్రాయర్ మీద ఊరేగిస్తా, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తా- నిప్పులు చెరిగిన నారా లోకేశ్

యువగళం పాదయాత్రకు మరో ఎంపీ గల్లా జయదేవ్ హాజరుకాకపోయినా.. ఆయన రాజకీయాలకు దూరమయ్యారన్న కారణంగా లైట్‌గా తీసుకుంది పార్టీ.. నాని విషయాన్ని మాత్రం సీరియస్‌గా పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న ఎంపీ.. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దూరంగా ఉండటాన్ని తీవ్రంగా పరిశీలిస్తోందని అంటున్నారు. ఈ కారణంగానే బెజవాడ బాధ్యతలను చిన్నికి అప్పగించడంపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు టీడీపీ కీలక నేతలు. ఇక ఈ ఇష్యూపై ఎంపీ నాని ఎలా స్పందిస్తారో? తన గైర్హాజరును ఎలా సమర్థించుకుంటారో చూడాల్సివుంది.