Mangalagiri Constituency: లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతుంటంతో ఆర్‌కే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది.

Mangalagiri Constituency: లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

Mangalagiri Assembly Constituency Ground Report

Mangalagiri Assembly Constituency: మంగళగిరి.. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన సీటు.. పార్టీకి ఎలాంటి బలం లేని ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి రిస్క్ చేశారు టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh). రాజధాని సెంటిమెంట్‌తో ఓట్ల వరద పారుతుందని అనుకున్నారు. తన వ్యూహం బెడిసికొట్టినా మళ్లీ అక్కడే పోటీ చేయాలనుకుంటున్నారు. పరాభవం ఎదురైన చోటే.. ప్రతాపం చూపాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ఇక లోకేశ్‌కు పోటీగా సామాజిక వర్గ లెక్కలతో బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టాలని అనుకుంటోంది వైసీపీ.. ఈ వ్యూహ ప్రతివ్యూహాల్లో విజయం సాధించేదెవరు? లోకేశ్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోంది..?

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పరువు ప్రతిష్టల పోరాటంగా మారింది మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గం పులివెందుల (Pulivendula), టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం (Kuppam) తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మంగళగిరి మాత్రమే. గత ఎన్నికల్లో సుమారు ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన టీడీపీ యువనేత నారా లోకేశ్ వచ్చే ఎన్నికల్లో రికార్డుస్థాయి మెజార్టీతో గెలుస్తానని శపథం చేస్తున్నారు. వైనాట్ 175 అంటూ సవాల్ విసురుతున్న వైసీపీ మళ్లీ మంగళగిరిలో ఎలా గెలుస్తారో చూస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. గత ఎన్నికల్లో పరాభవం ఎదురైనా.. ఓడిన చోటే గెలుపు పిలుపు ఉంటుందని.. సొంత నిధులతో విస్తృత సేవా కార్యక్రమాలతో దూకుడు చూపుతున్నారు లోకేశ్.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారారెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు. తొలిసారి కేవలం 12 ఓట్ల తేడాతోనే గెలిచిన ఎమ్మెల్యే.. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ ఇద్దరి మధ్య మళ్లీ పోటీ జరుగుతుందా? లేక ఆర్‌కేకు ప్రత్యామ్నాయంగా మరోనేత బరిలో దిగుతారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌కు దారితీస్తోంది.

Nara Lokesh Mangalagiri

Nara Lokesh

గత ఎన్నికల్లో ప్రజా తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా సేవా కార్యక్రమాలతో దూసుకువెళుతున్నారు నారా లోకేశ్. మంగళగిరిని చాలెంజ్‌గా తీసుకుని వచ్చే ఎన్నికల్లో తన సత్తా చూపాలని పనిచేస్తున్నారు. నియోజకవర్గంపై పట్టుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. యువగళం పాదయాత్రకు వెళ్లే వరకు మంగళగిరి వాసులకు అందుబాటులో ఉంటూనే రాష్ట్ర రాజకీయాలు చేశారు. ప్రభుత్వం చేయలేని పనులను సొంత నిధులతో పూర్తిచేశారు. నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్లినా లోకేశ్ ఆర్థిక సహాయం చేసిన తోపుడు బండ్లు, వాటర్ ట్యాంకర్ల కనిపిస్తున్నాయి. ఆరోగ్య సంజీవిని పేరుతో మొబైల్ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు లోకేశ్. తన సొంత ఖర్చులతో ప్రజలకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత ట్రైలరింగ్‌ శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్నారు. నూతన వధూవరులకు పెళ్లి కానుక అందజేస్తున్నారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగలకి తోఫాలు అందజేస్తున్నారు. ఈ విధంగా నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసిన లోకేశ్.. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy

టీడీపీకి అచ్చిరాని మంగళగిరిలో పోటీ చేసి రిస్క్ చేసిన లోకేశ్.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాశమని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి భవిష్యత్‌పై అనిశ్చితి ఏర్పడటంతో భూముల ధరలు భారీగా పడిపోయాయి. ఇది స్థానికంగా అన్ని వర్గాలను ప్రభావితం చేయడంతోపాటు లోకేశ్‌కు కలిసొచ్చే అవకాశంగా ఉందని పరిశీలకుల అభిప్రాయం. ఇక స్థానిక ఎమ్మెల్యే ఆర్‌కేపై సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తనపై వ్యతిరేకత చూపుతున్న వారితో సమావేశం కావడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నా.. ఎవరూ కలిసిరావడం లేదంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్కేను మార్చి మరో నేతను బరిలో దింపాలని భావిస్తోంది వైసీపీ. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న బీసీ నేతకు చాన్స్ ఇవ్వాలని అనుకుంటోంది.

Ganji Chiranjeevi

Ganji Chiranjeevi

అంగ, అర్థ బలాల్లో లోకేశ్‌ను ఢీకొట్టే సత్తా ఒక్క ఆర్కేకే ఉంది. కానీ, ఆయనకు స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తుండటంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి (Ganji Chiranjeevi), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు (murugudu hanumantha rao), కాండ్రు కమల (kandru kamala) పేర్లు పరిశీలిస్తోంది. మంగళగిరిలో చేనేత వర్గాల ఓట్లు ఎక్కువ. అందుకే ఆయా వర్గాల నేతలకు పెద్దపీట వేస్తోంది వైసీపీ. లోకేశ్‌ టార్గెట్‌గా చేనేత వర్గానికే చెందిన చిరంజీవిని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకుని చేనేత కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించింది.

Kandru Kamala

Kandru Kamala

మరోవైపు మాజీ మంత్రి హనుమంతరావును ఎమ్మెల్సీ చేసింది. ఇదే సమయంలో వైసీపీ వ్యూహానికి చెక్ చెప్పేలా టీడీపీ పావులు కదుపుతోంది. ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించిన పంచుమర్తి అనురాధకు (Panchumarthi Anuradha) మంగళగిరి బాధ్యతలు అప్పగించింది. చేనేత సామాజిక వర్గానికి చెందిన అనురాధ టీడీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆమె ప్రొటోకాల్ నియోజవకర్గంగా మంగళగిరిని ఎంచుకుని.. లోకేశ్‌ను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. అనురాధతోపాటు టీడీపీ సీనియర్ నేతలు పోతినేని శ్రీనివాసరావు, నందం అబద్ధయ్య క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ లోకేశ్‌ను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

Panchumarthi Anuradha

Panchumarthi Anuradha

మరోవైపు వైసీపీ కూడా మంగళగిరిలో లోకేశ్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సీఎం జగన్ నివాసం కూడా ఇదే నియోజకవర్గంలో ఉండటం.. టీడీపీ భవిష్యత్ నాయకుడిని రాజకీయంగా దెబ్బతీయడం ద్వారా పైచేయి సాధించాలని చూస్తోంది వైసీపీ. ఐతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత 40 ఏళ్లలో టీడీపీ ఇక్కడ రెండు సార్లే గెలిచింది. పొత్తుల్లో భాగంగా ఎప్పుడూ మిత్రపక్షాలకు ఈ సీట్లు ఇవ్వడం వల్ల మంగళగిరిలో ఆ పార్టీకి సరైన క్యాడర్ లేకపోయింది. 1983, 85 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ మళ్లీ లోకేశ్ ఎంట్రీ తర్వాతే ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో రాజధాని సెంటిమెంట్‌తో ఈజీగా గెలుస్తారని భావించినా.. వైసీపీ హవాలో కంగుతిన్నారు లోకేశ్. ఈ సారి అదే రాజధాని సెంటిమెంట్ బలంగా ఉండటంతో లోకేశ్‌కు కలిసొస్తుందనే అంచనాలు ఉన్నాయి. పైగా 2014లో కేవలం 12 ఓట్ల తేడాతోనే ఈ సీటును కోల్పోయింది టీడీపీ. ఈ లెక్కలన్నీ బేరీజు వేస్తోన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం పెంచుకుంటోంది.

Also Read: సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా లక్ష్మీనారాయణ వల్ల అవుతుందా?

ఇక స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీపై క్లారిటీ రావాల్సివుంది. స్థానికంగా సొంత సామాజిక వర్గం నుంచే ప్రతికూలత ఎదురవుతుంటంతో ఆర్‌కే వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేస్తారనే టాక్ ఉంది. బాపట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతిపై (Kona Raghupathi) అసమ్మతి ఉందని చెబుతున్నారు. దీంతో ఆర్కేను బాపట్లకు మార్చాలనే ప్రతిపాదన పరిశీలిస్తోంది వైసీపీ.. సీనియర్ నేత ఉమ్మారెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండే బాపట్ల ఐతే ఆళ్ల పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా గెలుస్తారని లెక్కలు వేస్తోంది వైసీపీ.. ఈ ప్లాన్‌లు ఎలా ఉన్నా.. లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసే నేత కోసం చురుగ్గా అన్వేషిస్తోంది అధికార పార్టీ.. ఈ పరిస్థితుల్లో మరో ఆరేడు నెలల్లో జరగబోయే ఎన్నికలు హైవోల్టేజ్ సమరాన్ని తలపిస్తున్నాయి.