Chandrababu : నా సీటు కూడా అప్పుడే నిర్ణయించుకుంటా.. నంద్యాలలో చంద్రబాబు హాట్ కామెంట్స్
ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎవరికి ఏ నియోజకవర్గం కేటాయిస్తారు? అన్నది.. Chandrababu Naidu - MLA Tickets

Chandrababu Naidu - MLA Tickets (Photo : Facebook)
Chandrababu Naidu – MLA Tickets : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లో ఆశావహులు పోటీ పడుతున్నారు. ఆ టికెట్ నాకే ఇవ్వాలని, ఆ సీటు నాకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు వేస్తున్నారు. ఎలాగైనా కోరుకున్న టికెట్ సాధించి అక్కడి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు నాయకులు.
తాజాగా టికెట్ల కేటాయింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎవరికి ఏ నియోజకవర్గం కేటాయిస్తారు? అన్నది ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు.
వివరాల్లోకి వెళితే.. నంద్యాల ఎమ్మెల్యే సీటుని భూమా బ్రహ్మానంద రెడ్డికి ఇవ్వాలంటూ ఆయన అభిమానులు చంద్రబాబు ముందు నినాదాలు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. ముందే సీట్లు నిర్ణయించము, ఎన్నికలప్పుడే నిర్ణయిస్తాము అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు.. నా సీటు కూడా ఎన్నికలప్పుడే నిర్ణయించుకుంటా అని చంద్రబాబు చెప్పారు.
”సరికొత్త వ్యూహాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నాము. ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తాము. అప్పటివరకు ఏ అభ్యర్థి ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనే విషయం ఎవరికీ తెలియదు. కుప్పంతో సహా ఎవరికీ సీటు గ్యారంటీ లేదు” అని ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు చంద్రబాబు. కుప్పంలో తాను పోటీ చేసేది, లేనిది ఎన్నికల సమయంలో మాత్రమే బయటపెడతానని, ఇప్పటికిప్పుడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.
”ముందే ఎక్కడా సీట్లు నిర్ణయించము. ఎన్నికల సమయంలో నిర్ణయిస్తాం. అందరితో సమావేశమైన తర్వాత అందరి అభిప్రాయం తీసుకొని టికెట్ నిర్ణయిస్తాం. అందరితో సమావేశమైన తర్వాత అందరి అభిప్రాయం తీసుకుని నా సీటు కూడా అప్పుడే నిర్ణయించుకుంటా తప్ప ముందే ఎక్కడా సీట్లు నిర్ణయించము” అని చంద్రబాబు అన్నారు.