Krsihnapatnam Anandaiah : మందు వికటిస్తే నేను బాధ్యుడిని కాను, ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలను కాపాడేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేయడం, ఆ మందు దేశవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే.

Krsihnapatnam Anandaiah : మందు వికటిస్తే నేను బాధ్యుడిని కాను, ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు

Krsihnapatnam Anandaiah

Updated On : July 14, 2021 / 5:15 PM IST

Krsihnapatnam Anandaiah : కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలను కాపాడేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేయడం, ఆ మందు దేశవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో ఆనందయ్య మందు పంపిణీ జరుగుతోంది. ప్రస్తుతం ఆనందయ్య మందును రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ప్రజలకు నేరుగా అందిస్తున్నారు. ప్రతిరోజూ వేలాది మందికి మందు పంపిణీ చేస్తున్నారు. కరోనా సోకని వారికి, పాజిటివ్ వచ్చిన వారికి అవసరాన్ని బట్టి ఔషధాన్ని అందిస్తున్నారు.

ఈ క్రమంలో తాను తయారు చేసి అందిస్తున్న మందుపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో తాను మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నానని చెప్పారు. అయితే, కొందరు మాత్రం తన పేరుపై నకిలీ మందు తయారు చేసి అమ్ముకుంటున్నారని ఆనందయ్య ఆరోపించారు. తన పేరుపై తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే అందుకు తాను బాధ్యుడ్ని కానని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ నకిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆనందయ్య సందర్శించారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఆనందయ్యం. ఆ తర్వాత పలువురికి కరోనా నివారణ మందు అందజేశారు. అన్ని ప్రాంతాలకూ తన మందు చేరిందన్న ఆనందయ్య ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, ఆనందయ్య మందుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడే బ్లాక్ లో విక్రయించడం, నకిలీ మందులు తయారు చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఏకంగా ఆనందయ్యే స్వయంగా నకిలీ మందు గురించి కామెంట్ చేయడం, మందు వికటిస్తే నేను బాధ్యుడిని కాదని అనడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా రోగుల కోసం ఆయుర్వేద మందులు, మూలికలతో ఆనందయ్య మందు తయారు చేస్తున్నారు. కరోనా రోగులకు దివ్య ఔషధంగా ఆనందయ్య మందు ప్రాచుర్యం పొందింది.