అమరావతి నిర్మాణాల కొనసాగింపునకు నిపుణుల కమిటీ గ్రీన్‌సిగ్నల్..
కొంతకాలంగా నీటిలోనే నానుతూ ఉన్నాయి. వాటి పటిష్టతను పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించింది. ఆ పునాదులను పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ నిపుణులు బోటులో వెళ్లాల్సి వచ్చింది.

Amaravati Buildings : అమరావతి నిర్మాణాల కొనసాగింపునకు ఐఐటీ చెన్నై, హైదరాబాద్ నిపుణుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో చేపట్టిన నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, వాటి పునాదులకు డోకా లేదని తేల్చాయి. ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హైకోర్టు, సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులను నిపుణులు పరిశీలించారు. వాటిపై అధ్యయనం చేసిన ఆ రెండు టీమ్ లు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశాయి. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక కూడా ఇవ్వనున్నాయి.
అమరావతిలో టీడీపీ హయాంలో చేపట్టిన సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే, ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఎండకు ఎండాయి, వానకు తడిచాయి. కొంతకాలంగా నీటిలోనే నానుతూ ఉన్నాయి. వాటి పటిష్టతను పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించింది. ఆ పునాదులను పరిశీలించేందుకు చెన్నై ఐఐటీ నిపుణులు బోటులో వెళ్లాల్సి వచ్చింది. పునాదుల నుంచి కొంత భాగాన్ని కత్తిరించి తీసుకెళ్లి వాటి పటుత్వాన్ని పరిశీలించారు.
Also Read : కిరణ్ కుమార్ రెడ్డికే పగ్గాలు? ఏపీపై బీజేపీ భారీ స్కెచ్..!
భవనాలు, పునాదులు పటిష్టంగానే ఉన్నాయని.. ఐదేళ్లుగా బయటకు కనిపిస్తూ తుప్పు పట్టిన ఇనుమును తొలగించి కెమికల్ ట్రీట్ మెంట్ చేసి భవన నిర్మాణాలను కొనసాగించవచ్చని ఐఐటీ నిపుణులు నిర్ధారణకు వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గ్రూప్ 1 అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు కూడా పటిష్టంగా ఉన్నట్లు హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం తేల్చింది. వాటి నిర్మాణాలను కొనసాగించవచ్చని ఆ బృందం రిపోర్టు ఇచ్చింది.