కరోనా : బయటికి రావొద్దని యముడు చెప్పినా వినరా?

కరోనాపై అవగాహన కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. యముడి వేషాధరణతో ఉన్న వ్యక్తిని రంగంలోకి దించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో ప్రజలకు చెప్పిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 08:57 PM IST
కరోనా : బయటికి రావొద్దని యముడు చెప్పినా వినరా?

Updated On : April 1, 2020 / 8:57 PM IST

కరోనాపై అవగాహన కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. యముడి వేషాధరణతో ఉన్న వ్యక్తిని రంగంలోకి దించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో ప్రజలకు చెప్పిస్తున్నారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇంటి నుంచి ఎవరు కూడా బయటికి రావొద్దని హెచ్చరించింది. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించాయి. అయినా కొంతమంది దర్జాగా రోడ్లపైకి వస్తున్నారు. నిత్యవసరాల పేరుతో ఇంటి నుంచి బయటికి బయలుదేరుతున్నారు. దీన్ని గమనించిన పోలీసులు తమ లాఠీలకు పని చెబుతున్నారు. రావొద్దని చెప్పినా వినకుండా రోడ్లపైకి వస్తున్నవారిని పోలీసులు చితకబాదుతున్నారు. వెంబడించి తరిమి కొడుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. అయితే కొంతమంది దెబ్బలు తినడానికైనా సిద్ధం కానీ తాము రోజుల తరబడి ఇంట్లో ఉండలేమంటూ రోడ్లపైకి వస్తున్నారు.  

ఈ నేపథ్యంలో కరోనాపై అవగాహన కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. యముడి వేషాధరణతో ఉన్న వ్యక్తిని రంగంలోకి దించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో ప్రజలకు చెప్పిస్తున్నారు. యముడి వెంట చిత్రగుప్తుడు కూడా ఉన్నారు. ‘మీ కర్మ ఉంటే బయటకు రండి…సంతోషంగా ఉంటే ఇంట్లో ఉండండి…దయచేసి పోలీసుల మాటలను ఆచరించండి’ అని కోరుతున్నాడు. కరోనాపై అవగాహన కల్పించేందుకు కర్నూలు జిల్లా డోన్ సీఐ సుధాకర్ రెడ్డి వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మరో వీడియోలో రోడ్లపై సంచరిస్తున్న వ్యక్తిని యముడు పట్టుకున్నాడు. ఈ వ్యక్తి ఎన్నిసార్లు బయట తిగిరిగాడంటూ చిత్రగుప్తుడిని వివరాలు కోరాడు. అతడు అధికారుల మాట వినకుండా, దొంగతనంగా బయటకు వస్తున్నాడని చిత్రగుప్తుడు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన అతన్ని నూనెలో కాల్చి వేయించాల్సిందిగా శిక్ష విధించాడు.  

కరోనాపై అవగాహన కల్పించేందుకు గతంలోనూ పోలీసులు వినూత్న ప్రచారాలు నిర్వహించారు. కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ప్రజలు బయటికి రావద్దంటూ పాటలు పాడి విన్నవించుకున్నారు. కరోనా వైరస్ హెల్మెట్లు ధరించి భయపెట్టారు.

అయినా ప్రజలు వారి మాటలను లెక్కచేయకుండా బయటకు వస్తున్నారు. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెర్ల నీళ్లు తాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇలా చెబితేనైనా వింటారేమోనని యముడితో చెప్పిస్తున్నారు. దీంతోనైనా జనాలు బయటికి రాకుండా ఉంటారో లేదో చూడాలి మరి.
 

Also Read | ఆఫ్రిది ఫౌండేషన్ కు సాయంపై కామెంట్స్ : విమర్శకులపై యువరాజ్ ఆగ్రహం