JEE Mains Exam : జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపుపై ఇంటర్ విద్యార్థుల తీవ్ర ఆవేదన
JEE Mains Exam : జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం భీమవరం విద్యార్థులకు లడఖ్‌లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

JEE Mains Exam Centres in Ladakh ( Image Source : Google )
JEE Mains Exam : జేఈఈ పరీక్షా కేంద్రాల కేటాయింపు విషయంలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఇంటర్ విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం భీమవరం విద్యార్థులకు లడఖ్‌లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాలుగా భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాజమండ్రి ఆప్షన్లను ఇద్దరు విద్యార్థులు ఎంచుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా కేంద్ర ఉన్నత విద్యా శాఖ ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది.
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29న పేపర్- 1కు లడఖ్ కార్గిల్‌లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించగా, ఈ నెల 30న జరగబోయే పేపర్ – 2 వైజాగ్‌లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించింది. భీమవరం నుంచి 3వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లడఖ్ (కాశ్మీర్)లో ఎలా పరీక్ష కేంద్రం కేటాయిస్తారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కాలేజ్‌లో పడవల సాయి లోకేష్, కేతా తేజ చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు.
పరీక్షా కేంద్రం కేటాయింపునకు సంబంధించి (NTA) కాల్ సెంటర్‌కు, మెయిల్స్‌కు ఎంత ఫిర్యాదు చేసినా స్పందన లేదు. 29న లడఖ్‌లో, 30న వైజాగ్‌లో పరీక్ష రాయడం ఎలా సాధ్యమని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్ధని, తమ పిల్లలు మనోవేదనకు గురవుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందించి.. కేంద్ర విద్యాశాఖతో మాట్లాడి పరీక్షా కేంద్రం మార్పు చేయాలని విన్నవించుకుంటున్నారు.