ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ రేషన్ అమలయ్యేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ రేషన్ అమలయ్యేనా?

Updated On : February 1, 2021 / 7:49 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ పథకం అమలు ఇప్పడు అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం మరోసారి వాయిదా పడబోతుందా? లేకపోతే ముందుగా అనుకున్నట్లుగా ఇంటింటికీ రేషన్ అమల్లోకి రావడం అనేది ఆసక్తికర విషయం. పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ప్రారంభోత్సవం రద్దయ్యింది.

ఇవాళ(1 ఫిబ్రవరి 2020) అనంతపురం జిల్లా కదిరిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇప్పటకే అధికారులు రద్దు చేశారు. దీంతో రేషన్ పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడినట్లు అయ్యింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి కొత్తపథకాలు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల డోర్ డెలివరీ చేయాలని భావించింది రాష్ట్ర ప్రభుత్వం.

ఏడాది నుంచి వాయిదా పడుతున్న ఈ కార్యక్రమానికి ఏదీ కలిసిరావడం లేదు. బియ్యం కార్డుల మంజూరులో ఆలస్యం, కరోనా లాక్‌డౌన్, ఆ తర్వత కొత్తకార్డుల మంజూరు వంటి పనులు ఆలస్యం కావడంతో పథకం ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా పంచాయితీ ఎన్నికలు కూడా పంపిణీకి ఆటంకిగా మారాయి.

ఈ క్రమంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో.. గ్రామాల్లో రేషన్‌ పంపిణీపై ఎస్‌ఈసీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అర్బన్‌ ఏరియాల్లో నేడు మొబైల్ రేషన్‌ను ప్రారంభిస్తామని అన్నారు మంత్రి కొడాలి నాని. డోర్‌ టు రేషన్‌ పంపిణీకి అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ధర్మాసనం.. రేషన్‌ వాహనాలపై నేతల ఫోటోలు, పార్టీ గుర్తులు ఉండకూడదని ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ చేపట్టాలని సర్కార్‌కు సూచించింది.

ఈ కార్యక్రమంపై రెండు రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని సర్కార్‌ను ఆదేశించింది. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని కోర్టుకు సర్కార్‌ కూడా వివరించింది. దీంతో 5 రోజుల్లో నిర్ణయం తెలపాలని ఎస్‌ఈసీని ఆదేశిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కోడ్‌ అమలు, కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న పౌరసరఫరాల శాఖ.. నేటి నుంచి అర్బన్‌ ప్రాంతాల్లో మాత్రం ఇంటింటికీ రేషన్‌ పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. మొబైల్ వాహనాల ద్వారా రేషన్‌పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.