Pawan Kalyan : వేశ్యలకు కూడా ఒక హక్కు ఉంటుంది- మరోసారి వాలంటీర్లపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan : వాలంటీర్ల దగ్గర ఇంటి గుట్టు మొత్తం ఉంటుంది. వ్యక్తిగత డేటా బహిర్గతం అవుతుంది. ఆడబిడ్డ రహస్యాలు బహిర్గతం చేసి..

Pawan Kalyan (Photo : Google)
Pawan Kalyan – Volunteers : జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు మీదున్నారు. తగ్గేదేలే అంటున్నారు. వాలంటీర్ల గురించి, వాలంటీర్ వ్యవస్థ గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పవన్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. పవన్ పై వైసీపీ నాయకులు, వాలంటీర్లు విరుచుకుడుతున్నారు. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని, క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. ఇంత జరిగినా పవన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. మరోసారి ఆయన వాలంటీర్ వ్యవస్థ గురించి హాట్ కామెంట్స్ చేశారు.
దెందులూరు నియోజకవర్గ శ్రేణులతో సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ”వాలంటీర్ల వ్యవస్థ పై, వాలంటీర్లపై నాకు కోపం లేదు. తిరుపతిలో జనవాణిలో వాలంటీర్ల వేధింపులపై మహిళల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఏమీ అనలేకపోతున్నాం. ప్రభుత్వం పంపిందని అంటున్నారని వాపోయారు. రాష్ట్రంలో మహిళలు మిస్ అయిపోయిన కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి.(Pawan Kalyan)
వాలంటీర్ల దగ్గర ఇంటి గుట్టు మొత్తం ఉంటుంది. వ్యక్తిగత డేటా బహిర్గతం అవుతుంది. వేశ్యలకు కూడా ఒక హక్కు ఉంటుంది. అలాంటిది ఆడబిడ్డ రహస్యాలు బహిర్గతం చేసి స్వేచ్ఛ హరిస్తున్నారు. సీఎం ఇంట్లో ఏం చేస్తే మాకెందుకు? వారి మంత్రులు గంట, అరగంట మాట్లాడుకుంటే మాకెందుకు? అలాగే ఏ ఒక్క కుటుంబ వ్యక్తిగత సమాచారం కూడా వాలంటీర్లకు ఎందుకు? వాలంటీర్లకు 5వేల జీతం ఇచ్చి వైసీపీ ప్రభుత్వం ఊడిగం చేయించుకుంటుంది” అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
అసలు పవన్ ఏమన్నారంటే..
వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం (జులై 9, 2023) ఏలూరులో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఏపీలో 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, దీని వెనుక వాలంటీర్ల హస్తం ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు తనతో చెప్పాయని పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒంటరిగా, భర్త లేని, బాధల్లో ఉన్న మహిళలను వెతికి పట్టుకోవడం, ట్రాప్ చేయడం, బయటకు తీసుకెళ్లడం, మాయం చేయడం ఇదే వాలంటీర్ల పని అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. మహిళల మిస్సింగ్ వెనుక వైసీపీ పెద్దల హస్తం కూడా ఉందన్నారు పవన్ కల్యాణ్.
”రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణ వెనుక వైసీపీ నేతలు ఉన్నారు. వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30వేల మందిలో 14వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థ గురించి పవన్ చేసిన ఈ ఆరోపణలు తీవ్ర దుమారమే రేపాయి.