జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం ఇద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గుత్తి కోర్టులో వారిని జడ్జీ ముందు ప్రవేశపెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై అట్రాసిటీ కేసుతోపాటు మరొక ఐదు కేసులు నమోదు చేశారు. 506,189, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నిన్న జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన దళిత సీఐని దూషించారు. అలాగే కరోనా నిబంధనలు ఉల్లంఘించడంతో కొన్ని సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులకు, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో కండీషన్ బెయిల్ లో భాగంగా సంతకాలు చేసేందుకు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు.
కండీషన్ బెయిల్ లో భాగంగా మూడు సార్లు స్టేషన్ కు రానున్నారు. బెయిల్ మంజూరు సందర్భంగా బుధ, శుక్ర, ఆది వారాల్లో పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకాలు పెట్టాలని జిల్లా కోర్టు కండీషన్ విధించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో నిన్న సాయంత్రం ఆయన కుమారుడు కడప జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సమయంలో ఆయన అనుచరులు జైలు దగ్గరకు భారీగా వచ్చారు.
అయితే అనుచరుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్థానికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ కాన్వాయ్ తీయడంతో ఓ అంబులెన్స్ అందులో ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు అనుచరుల తీరుపై మండిపడ్డారు. ఇదే సమయంలో పోలీసులపై జేసీ దురుసుగా ప్రవర్తించారు.
దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదు చేశారు. నిన్న కడప జైలు నుంచి తాడిపత్రికి వస్తున్నక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు.