Mla Madhavi Reddy : లుంగీ కట్టుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్- కడప మేయర్‌పై ఎమ్మెల్యే మాధవి ఫైర్
వన్ సైడ్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ పెద్ద మనిషి.

Mla Madhavi Reddy : కడప కార్పొరేషన్ లో మరోసారి మేయర్ సురేశ్ బాబు, ఎమ్మెల్యే మాధవి రెడ్డి మధ్య కుర్చీ ఫైట్ జరిగింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అనవసరంగా గొడవ చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవిపై మేయర్ సీరియస్ అయ్యారు. ఎక్కడ తన కుర్చీ లాగేస్తారో అనే భయంతోనే.. మేయర్ కుర్చీ నుంచి కూడా లేవడం లేదని ఎమ్మెల్యే మాధవి విమర్శించారు. లుంగీ కట్టుకుని ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ మేయర్ పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి.
భయబ్రాంతులకు గురి చేసి కార్పొరేటర్లను లాక్కున్నారు..
ఇక, కడప కార్పొరేషన్ సమావేశంలో 54 అంశాలకు ఆమోదం లభించిందని మేయర్ సురేష్ తెలిపారు. మా కార్పొరేటర్లు అందరూ అజెండా ఆమోదించారని ఆయన వెల్లడించారు. అభివృద్ధి నిరోధకురాలు ఎమ్మెల్యే మాధవి రెడ్డి అని మండిపడ్డారు మేయర్ సురేశ్ బాబు. కూటమి ప్రభుత్వంలో అవ్వా తాతల పెన్షన్ తప్ప ఏ అభివృద్ధి లేదని విమర్శించారు. ఎమ్మెల్యేకు కార్పొరేటర్ల నుంచి వెన్నుపోటు తప్పదని హెచ్చరించారు. భయబ్రాంతులకు గురి చేసి కార్పొరేటర్లను లాక్కున్నారని ఆరోపించారు. వెంచర్లను అడ్డు పెట్టుకుని కార్పొరేటర్లను ఎమ్మెల్యే మాధవి రెడ్డి భయబ్రాంతులకు గురి చేశారని చెప్పారు.
Also Read : పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పర్యటనలో తొక్కిసలాట.. స్పృహతప్పి పడిపోయిన బాలిక
‘భారత దేశంలో ఏ మేయర్ ఇంటిపై చెత్త వేసిన దాఖలాలు లేవు..
‘భారత దేశంలో ఏ మేయర్ ఇంటిపై చెత్త వేసిన దాఖలాలు లేవు. నా ఇంటిపైన చెత్త వేయమని మనుషులను పురామయించారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి. ప్రజలకు పని చేసేందుకే కార్పొరేషన్. తీర్మానాన్ని ఆమోదించకపోతే ప్రజల కోసం కోర్టుకెళ్తాము. 2014లో మా పార్టీలోని ఇద్దరు శాసనసభ్యులు కార్పొరేషన్ లో కింది వరుసలోనే కూర్చున్నారు. తమకు గౌరవం కల్పించాలని శాసనసభ్యులు కోరితే నా అభీష్టానికి ఆ రోజు పైన కూర్చోబెట్టాను.
ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సమావేశంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డిని గౌరవించాము. సమావేశంలో కార్పొరేటర్లను ఇష్టానుసారంగా దూషించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి. మా కార్పొరేటర్లకు గౌరవం ఇవ్వనందుకే ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ వేయలేదు’ అని మేయర్ సురేశ్ బాబు వివరించారు.
కడప కార్పొరేషన్ లో ప్రజాస్వామ్యం లేదు..
అటు ఎమ్మెల్యే మాధవి రెడ్డి సైతం మేయర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనపై ఎదురు దాడికి దిగారు. ప్రజాసేవ చేసే వారికి మేయర్ చూపించే మార్గం ఇదేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. నాణ్యత లేని దేవుని కడప రోడ్డు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ రోడ్లు అని విమర్శించారు. కార్పొరేటర్ల రాకను మేయర్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కడప కార్పొరేషన్ లో ప్రజాస్వామ్యం లేదన్నారు.
‘కార్పొరేటర్ల ప్రశలకు సమాధానం చెప్పలేని మేయర్. కడపలో ఇష్టానుసారంగా మేయర్ కుటుంబం కట్టడాలు కడుతోంది. మేయర్ సురేశ్ బాబు అజెండా చదవకుండానే ఆమోదించుకున్నారు. సమావేశం నుంచి పారిపోయారు. ఇంట్లో లుంగీ కట్టుకుని అజెండా ఆమోదించడం బెటర్. దీంతో ప్రజల డబ్బు ఆదా అవుతుంది. మేయర్ కు మహిళలంటే మర్యాద, గౌరవం లేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా అక్రమ రాజ్యం నడుపుతున్నారు మేయర్ సురేశ్ బాబు.
మేయర్ కుటుంబసభ్యులు అవినీతి చేయొచ్చు…
మేయర్ కు ప్రజా సమస్యలు పట్టవు. మేయర్ కుటుంబసభ్యులు జీ ప్లస్ 2 పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు కట్టుకుంటారు. నిబంధనలను అతిక్రమించి ఇళ్లు కట్టుకుని అవినీతి చేయొచ్చు. అదే పేద వాళ్లు ఇల్లు కట్టుకుంటే దాడి చేయడానికి వెళ్తారు, వాటిని కూలుస్తారు. వన్ సైడ్ రాజ్యాంగం నడుపుతున్నారు ఈ పెద్ద మనిషి. మేయర్ ఈ మీటింగ్ లు పెట్టొద్దు. చక్కగా ఇంట్లో కూర్చుని అధికారులను పిలిపించుకుని సంతకాలు పెట్టించుకుని అజెండాలు ఫినిష్ చేసుకోండి’ అని విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవి.
Also Read : అల్లుడి కోసం మామ.. గాంధీభవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి