Kancharla Chandrashekar Reddy : అల్లుడి కోసం మామ.. గాంధీభవన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
గాంధీ భవన్ కు వెళ్లిన సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని చంద్రశేఖర్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది.

Kancharla Chandrashekar Reddy : అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు. గాంధీ భవన్ కు వెళ్లిన ఆయన.. దీపాదాస్ మున్షీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీలో అల్లు అర్జున్ ఇష్యూపై ఆమెతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలవాలని భావించారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. అయితే, మహేశ్ కుమార్ గౌడ్ బిజీగా ఉండటంతో ఆయనను కలవకుండానే వెనుదిరిగారు చంద్రశేఖర్ రెడ్డి.
నేను కాంగ్రెస్ లోనే ఉన్నా- కంచర్ల
గాంధీ భవన్ కు వెళ్లిన సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని చంద్రశేఖర్ రెడ్డి అన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేతలను కలవటానికి మాత్రమే గాంధీ భవన్ కు వచ్చానని చెప్పుకొచ్చారాయన. సంధ్య థియేటర్ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు రావటం, ఏఐసీసీ ఇంఛార్జ్ తో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ముఖ్య నేతలు దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ లో ఉన్నారనే సమాచారంతో ఆయన గాంధీభవన్ కు వచ్చారు. అయితే, వారిని కలవడానికి వస్తున్నట్లుగా కంచర్ల తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్ కు వచ్చిన సమయంలో.. ముఖ్య నేతలంతా ప్రెస్ మీట్ లో ఉన్నారు. గాంధీభవన్ కు వచ్చిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. పీసీసీ చీఫ్ చాంబర్ లో కాసేపు కూర్చున్నారు. ఇటీవల అల్లు అర్జున్, పుష్ప 2, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ కు సంబంధించిన పరిణామాలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయి.
కాంగ్రెస్ టార్గెట్ గా బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు..
బీజేపీ, బీఆర్ఎస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. డీకే అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ పెద్దలను కలిసి కూల్ వాతావరణం చేయడానికి, ఈ వ్యవహారం సద్దుమణిగేలా ఆయన ఒక ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు.
అయితే, తాను గాంధీభవన్ కు వస్తున్నట్లు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యనేతలకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. కంచర్ల గాంధీభవన్ కు వచ్చిన సమయంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రెస్ మీట్ లో ఉన్నారు. కాసేపు వెయిట్ చేసిన ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత దీపాదాస్ మున్షీతో కాసేపు భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని, పార్టీ పెద్దలను కలిసేందుకు గాంధీభవన్ కు వచ్చానని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Also Read : టాలీవుడ్ కు సినిమా కష్టాలు..! రేవంత్ సర్కార్ నిర్ణయంతో పెద్ద హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పవా?