Kakinada Lok Sabha Constituency : కాకినాడలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరగనుందా?….ఈసారి ఎన్నికల్లో బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు ఏపార్టీకి?

కాకినాడ పార్లమెంట్ పరిధిలో.. కాకినాడ సిటీ తర్వాత.. అంత పెద్ద నియోజకవర్గం తుని. ఇక్కడ.. పార్టీలతో కాకుండా.. బరిలో దిగే అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ.. వైసీపీ ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా ఉన్నారు. మంత్రిగానూ పనిచేస్తున్నారు. రెండు సార్లు గెలిచి.. తుని నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు.

Kakinada Lok Sabha Constituency : కాకినాడ.. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన ప్రాంతం. ఆ ప్రాంతం లాగే.. అక్కడి లోకల్ పాలిటిక్స్.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉంటాయ్. అలాంటి.. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి.. ఈసారి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగ్ ఎంపీకి.. మళ్లీ పోటీ చేయాలన్న ఆసక్తి ఉందా? కొత్తగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్న వాళ్లు.. రాజకీయ అనుభవం ఉన్నవాళ్లేనా? సీనియర్లను పక్కనబెట్టి.. పార్టీలు యువతరానికి పట్టం కడతాయా? ఇలా.. ఇప్పటి నుంచే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఈ చర్చంతా కాకినాడ ఎంపీ స్థానం గురించే కాదు. ఆ లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపైనా ఉంది. ఎన్నికలకు ముందు.. అక్కడి రాజకీయం ఎలా మారబోతుంది.? రాబోయే ఎన్నికల్లో.. కాకినాడ పార్లమెంట్ బరిలో దిగేదెవరు? అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఏ పార్టీ బలంగా ఉంది? ఈసారి.. తెలుగుదేశం పసుపు జెండా ఎగరేస్తుందా? మళ్లీ.. ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతుందా? 2024 ఎలక్షన్ రేసులో ఉన్న ఆ రేసుగుర్రాలు ఎవరు?

vanga geetha

అయితే.. కొన్నేళ్లుగా కాకినాడ పార్లమెంట్ బరిలో.. కాపు సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేయడం, గెలుపొందడం జరుగుతోంది. అందుకు.. ఆ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో.. కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటమే కారణం. పైగా.. కాపు సామాజికవర్గ నేతలు ఎక్కువగా ఉండటం మరో అడ్వాంటేజ్. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి వంగా గీతా ఎంపీగా గెలిచారు. తెలుగుదేశం నుంచి చలమలశెట్టి సునీల్, జనసేన నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో.. సిట్టింగ్ ఎంపీ గీత.. తిరిగి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదనే టాక్ క్యాడర్‌లో వినిపిస్తోంది. ఇదే.. ఇప్పుడు లోకల్‌గా చర్చనీయాంశంగా మారింది.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

2009లో పిఠాపురంలో.. ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు వంగా గీత. అక్కడి ప్రజలతో.. ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందువల్ల.. వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ నుంచి కాకుండా పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. ఎంపీ నిధులతో పిఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. ఆ స్థానం వంగా గీతకు ఇచ్చే అవకాశం తక్కువగానే కనిపిస్తోందని కార్యకర్తలు అనుకుంటున్నారు. ఇక.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్.. స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత.. వైసీపీలో చేరి.. కాకినాడ పార్లమెంట్‌కి దూరంగా ఉన్నారు. అయితే.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో.. ఆయన 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి ఉంది. అదే.. ఈసారి తమను గెలిపిస్తుందని.. సునీల్ వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈసారి.. వైసీపీ నుంచే చలమలశెట్టి సునీల్ పోటీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్.

naveen

టీడీపీ విషయానికొస్తే.. యువతరానికి బాధ్యతలు ఇవ్వాలనే ఉద్దేశంతో.. జ్యోతుల నవీన్‌కు కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ పదవి ఇచ్చారు. అయితే.. జగ్గంపేట టికెట్ జ్యోతుల నెహ్రూకి ఇచ్చే అవకాశం ఉండటంతో.. నవీన్‌కి ఎంపీగా అవకాశం ఇవ్వరనే చర్చ జరుగుతోంది. అందువల్ల.. తెలుగుదేశం నుంచి కాకినాడ ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతానికి.. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన వాసంశెట్టి పేరు.. లైన్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం.. ఆయన టీడీపీ స్టేట్ బీసీ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఇక.. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు.. కాకినాడకు చెందిన సానా సతీష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికైతే.. జనసేన నుంచి ఎవరూ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో.. మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా ఎవరైనా ముందుకొస్తారా? లేదా? అన్నది తేలిపోతుంది.

READ ALSO : Jana Sena Avirbhava Sabha : మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. తొలిసారి వారాహి వాహనంలో రానున్న పవన్ కల్యాణ్

కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయ్. అవి.. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌తో పాటు పిఠాపురం, ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం, జగ్గంపేట. ఇవన్నీ.. జనరల్ కేటగిరీలోనే ఉన్నాయ్.

dwarampudi, vanmadi

కాకినాడ సిటీ సెగ్మెంట్‌ని పరిశీలిస్తే.. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి ప్రతిపక్ష నేతగా మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్.. కుటుంబం సీఎం జగన్‌కి అత్యంత సన్నిహితులు కావడంతో.. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ ఆయనకే సీటు దక్కే అవకాశం ఉందని సర్వే వర్గాలు చెబుతున్నాయ్. అయితే.. టీడీపీ నుంచి వనమాడి కొండబాబు అధికార ప్రతినిధిగా ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారనే ఆరోపణలున్నాయ్. దాంతో.. టీడీపీ వనమాడికి అవకాశం ఇస్తుందా? లేదా? అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయనకు మత్స్యకార వర్గాలపై మంచి పట్టున్నా.. గతంలో మేయర్‌గా పనిచేసిన సుంకర పావని వర్గం వనమాడికి వ్యతిరేకంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయ్. అంతర్గతంగా కాకినాడ సీటు దక్కించుకునేందుకు పావని కూడా పనిచేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇక.. టీడీపీ-జనసేన మధ్య గనక పొత్తు కుదిరితే.. జనసేన నుంచి ముత్తా కుటుంబం కీలకంగా ఉంది. అప్పుడు.. ఈ సీటును ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

kannababu, lakshmi, esudasu

READ ALSO : Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో.. కాపు, బీసీ సామాజికవర్గాల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం.. వైసీపీ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు ఉన్నారు. గత కేబినెట్‌లో.. మంత్రిగానూ పనిచేశారు. అయితే.. వైసీపీ సర్వేల్లో కన్నబాబుపై కొంత వ్యతిరేకత ఉందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ.. జిల్లాలో కన్నబాబు కీలక నేతగా ఉండటం, మరొకరు వచ్చి పోటీ చేసినా.. కన్నబాబు స్థాయిలో విజయం సాధించే అవకాశం లేనందున.. ఈసారి కూడా ఆయనకే సీటు వచ్చే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ తరఫున బీసీ సామాజికవర్గం నుంచి మహిళా కోటాలో పిల్లి అనంతలక్ష్మి పేరు వినిపిస్తోంది. పార్టీలో.. శ్రీనివాస్ బాబా, పేరాబత్తుల రాజశేఖర్ సైతం క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవలే.. కాపు నేతగా గుర్తింపు తెచ్చుకున్న ఏసుదాసు కూడా టీడీపీలో తిరుగుతున్నారు. చంద్రబాబు కూడా దాసుకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో హామీ ఇచ్చినట్లు మరో టాక్. అందువల్ల.. తెలుగుదేశం తరఫున ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు కుదిరితే.. రూరల్ సీటును జనసేన కావాలని అడుగుతున్నట్లు సమాచారం. ఆ పార్టీ నుంచి పంతం నానాజీ పోటీ చేస్తే.. విజయం దక్కే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

dorababu, pawankalyan,varma

ఇక.. పిఠాపురం నియోజకవర్గం విషయానికొస్తే.. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తారో.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనే నానుడి ఉంది. దీనిని.. వైసీపీ తిరగరాసింది. ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యాక.. 3 సార్లు మినహా.. అన్ని సార్లు కాపు నేతలకే పట్టం కట్టారు. ప్రస్తుతం.. వైసీపీ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. తాజా సర్వేలు కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నట్లు సమాచారం. అయితే.. సిట్టింగ్ ఎంపీ వంగా గీత.. ఈసారి పిఠాపురం నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. కాపు నేత ముద్రగడ పద్మనాభం సైతం వైసీపీ నుంచి పిఠాపురం సీటు అడుగుతున్నట్లు సమాచారం. వీళ్ల ముగ్గురిలో.. పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇక.. ప్రతిపక్ష టీడీపీ తరఫున.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎస్ వర్మ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజల్లోనే ఉంటున్నారు. అయితే.. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే వార్త.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ గనక పోటీలో ఉంటే.. కచ్చితంగా గెలుస్తారనే టాక్ ఉంది. సేనాని గనక ఇక్కడ బరిలోకి దిగకపోతే.. టీడీపీ నుంచి వర్మకే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

READ ALSO : Eluru Lok Sabha Constituency : ఏలూరులో పాగా వేయాలని టీడీపీ వ్యూహాలు….క్లీన్‌స్వీప్‌ చేయడమే టార్గెట్‌గా అధికార పార్టీ అడుగులు

prasad, rajesh,raja

ప్రత్తిపాడు సెగ్మెంట్‌ విషయానికొస్తే.. ఈ నియోజకవర్గం మొదటి నుంచి కాపు నేతలకే పట్టం కడతూ వచ్చింది. ఇక్కడ.. ప్రధానంగా పర్వత, వరుపుల కుటుంబాల మధ్యే పోటీ సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం.. పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన.. పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా.. ప్రజలు, సొంత కార్యకర్తలు సంతృప్తిగా లేరనే చర్చ సాగుతోంది. ఇక.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరుపుల రాజా అకస్మికంగా గుండెపోటుతో మృతి చెందటంతో ఆపార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరోవైపు రాజా కుటుంబసభ్యుల్లో ఒకరికి ఈ సారి సీటు ఇస్తారన్న ప్రచారం సాగుతుంది. అదే క్రమంలో ఇటీవలే టిడిపిలో చేరిన మహాసేన నాయకుడు రాజేష్ కు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల నుండి టాక్ నడుస్తుంది.

chantibabu, narasimham, nehru

READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

జగ్గంపేట రాజకీయమంతా.. కాపు కుటుంబాల మధ్యే నడుస్తోంది. ఒకే ఫ్యామిలీకి చెందిన బాబాయ్-అబ్బాయ్ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పోటీలో నిలుస్తారు. ఇక్కడ పోటీ చేసే వారి భవితవ్యం.. కాపు సామాజికవర్గం ఓటర్ల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా.. వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల చంటిబాబు ఉన్నారు. మరో వైసీపీ నేత తోట నరసింహం.. స్వయంగా తానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించేశారు. ఆయన జగ్గంపేట సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. వీళ్లిద్దరిలో.. జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది. ఇక.. టీడీపీలో జ్యోతుల నెహ్రూ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నారు. ప్రస్తుతం.. జిల్లాలో టీడీపీ గెలిచే స్థానాల్లో జగ్గంపేట కూడా ఉందని సర్వేలు చెబుతున్నాయ్.

rjappa, dorababu

ఇక.. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న పెద్దాపురం నియోజకవర్గంలో.. కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇప్పటికే.. ఆరు సార్లు టీడీపీ ఇక్కడ జెండా ఎగరేయడంతో.. వచ్చే ఎన్నికల్లోనూ.. పసుపు జెండానే ఎగురుతుందని నమ్ముతోంది టీడీపీ. ఇక్కడ.. హ్యాట్రిక్ కొట్టేందుకు నిమ్మకాయల చినరాజప్ప శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇక.. వైసీపీ విషయానికొస్తే.. రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్న దవులూరి దొరబాబు.. పెద్దాపురం ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయనకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్.. మాజీ మంత్రి తోట నరసింహం సతీమణి.. వాణికి ఇవ్వడంతో.. సొంత పార్టీ నేతలే ఓడించారనే టాక్ అప్పట్లో వినిపించింది. గడప గడపకు వైసీపీ కార్యక్రమంతో.. ప్రజల్లోకి వెళుతున్న దొరబాబుకు.. ఈసారైనా టికెట్ దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. తోట వాణి, తోట సుబ్బారావు నాయుడుకు చెందిన క్యాడర్.. దొరబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్వేల్లోనూ.. దొరబాబుకు అంతగా అనుకూల పరిస్థితులు లేవనే చర్చ జరుగుతోంది. తన క్యాడర్‌ని కాపాడుకోవడంలో.. ఆయన ఫెయిలయ్యారనే వాదన ఉంది.

 

raja, divya

కాకినాడ పార్లమెంట్ పరిధిలో.. కాకినాడ సిటీ తర్వాత.. అంత పెద్ద నియోజకవర్గం తుని. ఇక్కడ.. పార్టీలతో కాకుండా.. బరిలో దిగే అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ.. వైసీపీ ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా ఉన్నారు. మంత్రిగానూ పనిచేస్తున్నారు. రెండు సార్లు గెలిచి.. తుని నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు. జగన్ సర్వేల్లో.. మంత్రి రాజాకు మంచి మార్కులే పడ్డాయని తెలుస్తోంది. ఇక్కడ.. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు.. రెండు సార్లు ఓటమిపాలయ్యారు. అయితే.. గతంలో యనమల ఇదే నియోజకవర్గంలో ఆరు సార్లు విజయం సాధించిన చరిత్ర ఉంది. గత రెండు ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం.. యనమల కుటుంబంలో సీటు రాజకీయం నడుస్తోంది. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వమని.. కృష్ణుడు అడుగుతుంటే.. రామకృష్ణుడు తన కూతురిని బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో.. కొన్నాళ్ల క్రితం పెద్ద దుమారమే రేగింది. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు.. తుని నియోజకవర్గ ఇంచార్జ్‌గా దివ్య పేరు ఖరారు చేయడంతో.. గందరగోళానికి చెక్ పడింది. దాంతో.. యనమల కృష్ణుడు ఏం చేస్తారన్నది.. ఆసక్తిగా మారింది.

READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

ప్రస్తుత రాజకీయాల్లో.. పార్లమెంట్ అభ్యర్థికి అంగ బలం ఉన్నా.. లేకున్నా.. అర్థబలం పరిపుష్టిగా ఉంటే చాలు అనేది.. పార్టీ అధినేతల అభిప్రాయం. ప్రజల్లో ఉన్నా.. లేకపోయినా.. డబ్బులు ఉంటే.. ఎంపి అయిపోయే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల.. రాబోయే రోజుల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో.. రాజకీయం ఎలా మారబోతోంది. అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఏ మేరకు హీట్ నెలకొంటుందన్నది.. మరింత ఆసక్తి పెంచుతోంది.

ట్రెండింగ్ వార్తలు