Kesineni Nani : 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఎంపీ కేశినేని చిన్ని .. బెదిరింపులకు లొంగేది లేదు.. కేశినేని నాని స్ట్రాంగ్ కౌంటర్!
Kesineni Nani : ఎంపీ కేశినేని చిన్నిపై సోదరుడు కేశినేని నాని ఫైర్ అయ్యారు. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన కేశినేని నాని బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు.

Kesineni Nani
Kesineni Nani : విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం ముదురుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేశినేని చిన్నిపై సోదరుడు నాని చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.
దాంతో సోదరుడు కేశినేని నానిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన కేశినేని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
విజయవాడ అభివృద్ధి కోసం నిజాయితీగా, పారదర్శకంగా, గర్వంగా సేవ చేశానన్నారు. 100 కోట్లకు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదన్నారు. భయంతో బెదిరింపులకు లొంగేదే లేదని కేశినేని నాని స్పష్టం చేశారు.
విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) నుంచి లీగల్ నోటీసు అందిందని చెప్పారు. తన పరువు నష్టం కోసం రూ. 100 కోట్లు డిమాండ్ చేశారు. ఇదంతా గౌరవనీయ సీఎంకు రాసిన బహిరంగ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తినందుకేనని అన్నారు. విజయవాడ ప్రజలకు 10 ఏళ్లు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే గౌరవం తనకు లభించిందని చెప్పారు.
జవాబుదారీతనం, పారదర్శకత, నిజాయితీతో బాధ్యతను నిర్వర్తించానని తెలిపారు. తాను రాసిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని ఆయనకు గుర్తు చేశారు. ఈ లీగల్ నోటీసు కేవలం బెదిరింపు మాత్రమే కాదన్నారు.
విమర్శలను అణచివేయడం, మౌనంగా నోరు మూయించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆరోపించారు. కానీ, ఈ విషయంలో తాను మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. ప్రజా కార్యాలయం ప్రజా పరిశీలనలో భూ లావాదేవీలు, అధికార దుర్వినియోగం, ఆరోపించిన అక్రమాల గురించి ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
అంతేకానీ, బెదిరింపులు కాదని కేశినేని నాని చెప్పారు. ఈ నియోజకవర్గానికి గర్వంగా సేవ చేశానన్న ఆయన తాను ఎందుకోసం నిలబడి పోరాడుతున్నానో తనకు తెలుసునన్నారు. తాను భయంతో రాజీ పడకుండా, నిశ్చయంగా, వాస్తవాలతో బహిరంగంగా స్పందిస్తాను తప్ప, మౌనంగా ఉండేది లేదు. సత్యం బెదిరింపులకు లొంగదు.. తాను లొంగనని కేశినేని నాని స్పష్టం చేశారు.