Kethamreddy Vinod Reddy: చంద్రయాన్‌కు, జనసేనకు ముడిపెడుతూ కేతంరెడ్డి సంచలన కామెంట్స్

తాను వైసీపీలో చేరిన వెంటనే అనేక జిల్లాల నుంచి జనసేన పార్టీ నేతలు ఫోన్లు చేసి అభినందించారని చెప్పుకొచ్చారు.

Kethamreddy Vinod Reddy: చంద్రయాన్‌కు, జనసేనకు ముడిపెడుతూ కేతంరెడ్డి సంచలన కామెంట్స్

Kethamreddy Vinod Reddy

Updated On : October 16, 2023 / 4:29 PM IST

Kethamreddy Vinod Reddy: జనసేన పార్టీకి ఇటీవలే రాజీనామా చేసి వైసీపీలో చేరిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఆశావాహ అభ్యర్థి, కీలక నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఇవాళ నాదెండ్ల మనోహర్‌పై మండిపడ్డారు. జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని పలు ఆరోపణలు గుప్పించారు.

చంద్రయాన్-1 సమయంలో జనసేన పార్టీకి బీజాలు పడ్డాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు చంద్రయాన్-3తో మనం చంద్రుడి మీదకు కూడా చేరామని, జనసేన పార్టీలో ఎదగాలి అనుకునే వారు మాత్రం శూన్యంలో సున్నా చుడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికి కారణం జనసేన నేత నాదెండ్ల మనోహర్ అని ఆరోపించారు.

జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ నాశనం చేస్తున్నారంటూ కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఆయనకు టీడీపీ వారు తోడయ్యారని ఆరోపించారు. పాతికేళ్లు ఆగండి అంటూ యువత భవితను జనసేన పార్టీలో పాతి పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

వైసీపీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీలో చేరానని అన్నారు. జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ అనే ఒక్క వ్యక్తి కోసమే తాను పనిచేశానని తెలిపారు. అయితే, ఆ పార్టీలో ఆయన చుట్టూ పనికిరాని వారు ఉన్నారని చెప్పారు.

టీడీపీతో పొత్తు కుదరకముందే తనను పిలిచారని తెలిపారు. నెల్లూరులో టీడీపీ నేత నారాయణ పోటీ చేస్తారని, తాను ఆయన కోసం పనిచేయాలి అని చెప్పారని అన్నారు. తాను ఎమ్మెల్యే టికెట్ కోసం పనిచేయట్లేదని, పవన్ ని ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపానని చెప్పుకొచ్చారు. తాను గతంలో నారాయణ అక్రమాల మీద తీవ్రంగా పోరాడానని తెలిపారు.

పార్టీలో నెంబర్ టూగా పిలుస్తోన్న నాదెండ్ల మనోహర్ తనపై కుట్రలు చేశారని అన్నారు. తనపై పవన్ కు లేనిపోనివి చెప్పారని తెలిపారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయని అన్నారు. అప్పట్లో
పవన్ టీడీపీని తిట్టి, ఇప్పుడు మళ్లీ వారితో కలిశారని చెప్పారు. తాను వైసీపీలో చేరిన వెంటనే అనేక జిల్లాల నుంచి జనసేన పార్టీ నేతలు ఫోన్లు చేసి అభినందించారని చెప్పుకొచ్చారు.