వైఎస్సార్ ఆసరా పథకం..ఇంటింటికీ రేషన్..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

  • Published By: bheemraj ,Published On : August 19, 2020 / 04:12 PM IST
వైఎస్సార్ ఆసరా పథకం..ఇంటింటికీ రేషన్..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Updated On : August 19, 2020 / 4:34 PM IST

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం (ఆగస్టు 19, 2020) సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.



ఈ కేబినెట్‌ సమావేశంలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ నుంచి ఇంటింటికీ రేషన్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలిపింది. వైఎస్సార్ విద్యా కానుక పథకానికి ఆమోదం తెలిపింది. విశాఖలో 1జీ డబ్ల్యూ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం చెప్పింది.

ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27 వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.



కేబినెట్‌ బేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్‌ 1న వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్‌ 5న వైఎస్సార్ విద్యాకానుక పథకం, సెప్టెంబర్‌ 11న వైఎస్సార్ ఆసరా పథకాలకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్‌ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు కూడా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్‌లు, షూ, బెల్టు తదితర వస్తువులను 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ఎలక్ట్రానికి పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు‍ తెలిపారు. రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.



ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్ సీడ్ కంట్రోల్ చట్టాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్‌లో అపెక్స్ కౌన్సిల్‌పై కూడా చర్చించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి ఇప్పటివరకు రూ.26 వేల 872 కోట్ల రుణాలు అందించామని.. రూ.60 కోట్లతో టొబాకో రైతులను ఆదుకున్నామని వెల్లడించారు.