భద్రతా ప్రమాణాలు శూన్యం, పరిమితికి మించి కరోనా పేషెంట్లు.. వెలుగులోకి విజయవాడ రమేష్ ఆసుపత్రి లీలు

  • Published By: naveen ,Published On : August 13, 2020 / 02:21 PM IST
భద్రతా ప్రమాణాలు శూన్యం, పరిమితికి మించి కరోనా పేషెంట్లు.. వెలుగులోకి విజయవాడ రమేష్ ఆసుపత్రి లీలు

Updated On : August 13, 2020 / 2:55 PM IST

విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై కమిటీలు రిపోర్టులు తయారు చేశాయి. ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వర్ణ ప్యాలెస్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు మే 18న అనుమతి కోరిన రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం, మే 15 నుంచే అందులో కరోనా కేర్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకపోయినప్పటికీ, కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు అనుమతులు లభించినట్టు అధికారులు తేల్చారు. అలాగే పరిమితికి మించి పేషెంట్లను చేర్చుకుని వారి నుంచి లక్షలు దండుకున్నట్టు నివేదికలో తెలిపారు.

కాగా, అగ్ని ప్రమాదాన్ని గుర్తించే పరికరాలు పని చేయకపోవడంతోనే స్వర్ణ ప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ లో 10 మంది మరణించినట్టుగా జేసీ శివశంకర్ కమిటీ అభిప్రాయపడింది. కమిటీ తన నివేదికను గురువారం(ఆగస్టు 13,2020) ప్రభుత్వానికి అందజేయనుంది. హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదంపై జేసీ శివశంకర్ నేతృత్వంలో కమిటీ నివేదికను సిద్దం చేసింది. ఈ నివేదికను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు అందించనున్నారు. ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున స్వర్ణ ప్యాలెస్ లోని కొవిడ్ కేర్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది మరణించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం జేసీ శివశంకర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రమాదంపై కమిటీ విచారణ నిర్వహించింది. ఫైర్, విద్యుత్, వైద్యంతో పాటు భద్రతపై వేర్వేరుగా రిపోర్టులను సిద్దం చేసింది. స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్ తో పాటు ఇతర కొవిడ్ కేర్ సెంటర్లకూ అనుమతులు లేవని కూడా కమిటీ నిర్ధారించింది. రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని కమిటీ అభిప్రాయపడింది.

స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మాడి మసైన మృతదేహాలను చూసి బంధువులు గుండెలవిసేలా రోదించారు. అసలే కరోనాతో కకావికలం అవుతున్న విజయవాడ ఈ విస్ఫోటనానికి విలవిల్లాడిపోయింది. అయితే ఈ ప్రమాదంపై అనేక కారణాలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్టు కలెక్టర్‌ ఇంతియాజ్‌ వెల్లడించారు. అతి శానిటైజేషన్‌ కారణంగా జరిగిందని కొందరు అంటున్నారు. హోటల్‌లోని ఫ్రంట్‌ ఆఫీస్‌లో ఉన్న సిబ్బంది ల్యాప్‌టాప్‌ కాలిపోవడంతో ప్రమాదం సంభవించిందన్నది మరో వాదన. ఫ్రంట్‌ ఆఫీస్‌ వెనుక వైపున ఉన్న సర్వర్‌ రూమ్‌ నుంచి పొగలు వ్యాపించాయని కొందరు చెబుతున్నారు. మంటలు, పొగ కింది నుంచి పైకి వ్యాపించడంతో మొదటి, రెండు అంతస్తుల్లో ఉన్న వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది.

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై 4 రోజులు దర్యాప్తు చేశారు. అగ్నిప్రమాద స్థలాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌, విద్యుత్‌శాఖ అధికారులు పరిశీలించారు. ఈ దర్యాప్తులో ఎఫ్ఎస్ఎల్ కమిటీ సభ్యుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. స్వర్ణ ప్యాలెస్‌ భవనంలో కేబుల్స్‌ను విద్యుత్‌ శాఖ అధికారులు పరిశీలించారు. ఆస్పత్రి, స్వర్ణ ప్యాలెస్‌ యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీమ్ ఉంది. దాదాపు మూడు గంటలు పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ కమిటీ దర్యాప్తు చేసింది. ప్రధానంగా ఆస్పత్రి నిర్లక్ష్యం కారణమేనని ప్రాధమికంగా కమిటీ నిర్ధారించింది. స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన విద్యుత్ షాట్ సర్క్యూట్‌పై కమిటీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. పూర్తిగా సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అధికారులు తీసుకెళ్లారు.