మదనపల్లి మర్డర్.. అనుమానాలు ఎన్నో.. కేసులోకి దిశ లాయర్ ఎంట్రీ!

చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసు వ్యవహారమంతా.. కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచార్య ముందుకు రాగా.. జంట హత్యల కేసులో అనుమానాలున్నాయని న్యాయవాది రజినీ అన్నారు.
మదనపల్లి సబ్ జైలులో ఉన్న నిందితులను కలిసేందుకు ప్రయత్నించిన రజినీకి, నిందితులను నేరుగా కలిసేందుకు అధికారులు అవకాశం ఇవ్వలేదు. దీంతో జైలు ద్వారం వద్దే నిలబడి నిందితుల్లో ఒకరైన పురుషోత్తంనాయుడుతో ఆమె మాట్లాడారు. అనంతరం రజిని మాట్లాడుతూ.. లాయర్ కృష్ణమాచార్య తరఫున నిందితులను కలిసేందుకు వచ్చినట్లు వెల్లడించారు. నిందితులకు న్యాయసహాయం అవసరమని, ఈ కేసులో అనుమానాలు చాలా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
హత్యాస్థలంలోని దృశ్యాలు క్షుద్రపూజలవి కావని, హత్యలకు, నిందితుల ఆధ్యాత్మిక చింతనకు సంబంధం ఉండక పోవచ్చుననే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. రుద్రుడు, క్షుద్రుడు అనే రెండు వేర్వేరు విషయాలను కేసులో చూపిస్తున్నారని, ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రావల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మర్డర్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పురుషోత్తం నాయుడు తరపున వాదించాలని పూర్వ విద్యార్థులు ఫోన్‌లో న్యాయవాదిని సంప్రదించినట్లు వారు చెబుతున్నారు.
పీవీ కృష్ణమాచార్య విషయానికి వస్తే.. ఈయన హైదరాబాద్ లో స్థిరపడ్డారు. సుప్రీంకోర్టులో అనేక సంచలన కేసులు వాదించారు. దిశ ఎన్ కౌంటర్ కేసుకు వ్యతిరేకంగా కూడా ఈయనే వాదిస్తున్నారు. మరణించిన నిందితుల కుటుంబాలకు అనుకూలంగా వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.