కర్నూలు జిల్లాలో సినీ ఫక్కీలో ప్రేమికుల కిడ్నాప్, రక్షించిన పోలీసులు

కర్నూలు జిల్లాలో సినీ ఫక్కీలో ప్రేమికుల కిడ్నాప్, రక్షించిన పోలీసులు

Updated On : January 30, 2021 / 4:01 PM IST

lovers kidnap in kurnool district, cops rescue : వరుసకు బంధువులైన ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇంట్లో వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. ఇంకేముంది తెలుగు సినిమాలోని  రాయలసీమ ఫ్యాక్షన్ సీన్  ఆవిష్కృతమైంది. పారిపోతున్న ప్రేమికుల్ని కిడ్నాప్  చేయటం, వారిని పోలీసులు రక్షించటం  జరిగింది.

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన అనిల్ కుమార్, నందికొట్కూరు కు చెందిన జయదాంబ వరుసకు బంధువులు.  కొంత కాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంట్లో పెద్దలకు చెప్పారు.  వారు విలన్లయి  పోయి…. ససేమిరా.. ఒప్పుకోమంటే   ఒప్పుకోమన్నారు. ఇక ఇలా లాభం  లేదనుకున్న ప్రేమకులిద్దరూ శుక్రవారం ఇళ్ళలో ఎవరికీ చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

నంది కొట్కూరులోని పగిడ్యాల రోడ్డులో ఉన్న బ్రహ్మంగారి గుడిలో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.  కర్నూలు నుంచి ఇద్దరూ ఒక వాహానంలో నందికొట్కూరు బయలు దేరారు.  వీళ్లు ఇంట్లోనుంచి   పారిపోవటం   గ్రహించిన   జయదాంబ మేనమామ మునుస్వామి మరో తోమ్మిది మంది అనుచరులతో కలిసి తుపాన్ వాహనంలో … ప్రేమికుల వాహానాన్ని వెంబడించాడు.

కర్నూలు సమీపంలోని నంద్యాల చెక్ పోస్టు వద్ద వారిని అడ్డుకుని   ఇద్దర్నీ కిడ్నాప్ చేసి తుపాను వాహనంలోకి ఎక్కించుకున్నాడు.  ఈ గందరగోళం  మధ్య అనిల్ కుమార్ 100 కి డయల్ చేసి కిడ్నాప్ విషయం   పోలీసులకు  చెప్పాడు.

నంద్యాల డీఎస్పీ వెంటనే   అలర్టై   నంద్యాల చెక్ పోస్టు దాటిన తర్వాత తుపాను వాహనాన్ని గుర్తించి అడ్డుకున్నారు.  కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ప్రేమికులిద్దరినీ  నందికొట్కూరు పోలీసు స్టేషన్ కు తరలించారు.