మావోయిస్టుల ప్రతీకార దాడులు.. పోలీసుల వాహనం పేల్చివేత.. ఏఎస్పీ మృతి
సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు.

Sukma district: మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగారు. ఇటీవల భద్రతాబలగాలు జరిపిన వరుస ఎన్‌కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలతోపాటు భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టులు ప్రతీకార దాడులకు షురూ చేసినట్లు కనిపిస్తుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనాన్ని పేల్చేశారు.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కొంటా సమీపంలోని చిక్వార్‌గూడ గనిలో మావోయిస్టులు పొక్లెయిన్‌ను కాల్చివేశారు. సోమవారం ఉదయం ఘటన స్థలాన్ని పరిశీలించడానికి కొంటా ఏఎస్పీ ఆకాశ్ రావు, పోలీస్ అధికారులు వెళ్లారు. కొంటా సమీపంలోని డోండ్రాలో ఐఈడీ బాంబుతో మావోయిస్టులు పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. దీంతో ఏఎస్పీతో సహా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్పీ అకాశ్ రావును ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనలో డీఎస్పీ, సీఐ సహా పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బలగాలు సంఘటన స్థలికి చేరుకున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.