Mekapati Rajamohan Reddy : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో మేకపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసే విషయం సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Mekapati Rajamohan Reddy
Mekapati Rajamohan Reddy : ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తమ్ముడు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. చంద్రశేఖర్ రెడ్డి డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశాడు కాబట్టే పార్టీ అతన్ని సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. ఆయన డబ్బులు తీసుకోకపోతే పార్టీ ఎందుకు సస్పెండ్ చేస్తుందన్నారు.
తనకు ముందుగానే సమాచారం తెలిసి..ఆయన అనుచరులు ద్వారా వారించేందుకు ప్రయత్నించానని తెలిపారు. అయినా తన మాట వినలేదన్నారు. ఆయన చేస్తానన్నవి దరిద్రపు ప్రమాణాలు అని ఎద్దేవా చేశారు. క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సమంజసమేనని వెల్లడించారు. ఉదయగిరిలో జరుగుతున్న పరిణామాలకు తాను కారణమని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం దుర్మార్గం అన్నారు.
చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన పక్కనున్న వారే దిష్టిబొమ్మలు తగల బెట్టారని చెప్పారు. తానేంటో, తన వ్యక్తిత్వం ఏంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో మేకపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసే విషయం సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీలో క్రాస్ ఓటింగ్ కలకలం రేపింది. వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే.