AP Rains : ఏపీకి వర్ష సూచన.. ఆ జిల్లాల్లో రెండు రోజులు అతి భారీ వర్షాలకు అవకాశం
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా ప్రకారం.. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో

AP Rains
Heavy Rain In AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. గత రెండు నెలల్లో వరుస తుపానులతో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో మరోసారి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా ప్రకారం.. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
రాబోయే రెండుమూడు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో ఈనెల 26, 27 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తోంది.
అల్పపీడనం తుపానుగా బలపడేందుకు అవకాశం ఉందని, తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి ఈనెల 27వ తేదీన ఏపీ లేదా తమిళనాడులో తీరం దాటొచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో రైతులు సాగుచేసిన పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. ముఖ్యంగా వరి, మిర్చి, పత్తి ఇతర పంటలు చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.