AP Rains : ఏపీలోకి రుతుపవనాలు ఎంట్రీ.. నేడు, రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. కానీ, ఈసారి ఇబ్బందులు తప్పవ్..! వర్షపాతం అంచనాలు ఇలా..
AP Rains : ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రెండుమూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Southwest Monsoon
- ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- రెండుమూడ్రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం
- రుతుపవనాలు ప్రవేశించినా ఈసారి వర్షాలు తక్కువే
AP Rains : నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఏపీలోని ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రానున్న రెండుమూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఎండల తీవ్రత కూడా ఉంటుందని, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 104 మండలాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
రుతుపవనాలు ప్రవేశించినా వర్షాలు తక్కువే..
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రెండుమూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చునని అంచాన వేశారు. అయితే, స్థానిక వాతావరణ మార్పుల వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంతమేరకు భర్తీ చేసే అవకాశం ఉందని తెలిపారు. కాకపోతే, ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు వచ్చే అవకాశం ఉంది. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, మరికొన్ని రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే సూచనలు ఉన్నాయని తెలిపారు.
రైతులకు కీలక సూచనలు..
♦ వాతావరణంలో వచ్చే మార్పులను రైతులు గమనిస్తూ అందుకుతగిన విధంగా తమ పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
♦ జూన్ – సెప్టెంబరు నెలల మధ్యలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, పోలవరం, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, కడప,నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో సాధారణంకంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
♦ ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
♦ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కృష్ణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
