ఎన్నికలకు మేము సిద్ధం : మంత్రి సంచలన స్టేట్ మెంట్

ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, వైసీపీ గెలిస్తే రాజధాని మార్చుకోవచ్చని చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. విశాఖలో రాజధాని వద్దని నలుగురి టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయిస్తే ఎన్నికలకు మేము సిద్ధమని మంత్రి అవంతి ప్రకటించారు.
రాజధానిపై టీడీపీ ఎమ్మెల్యేల వైఖరేంటి..?
3 రాజధానులకు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారని, మరి 21మంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి ఏంటని మంత్రి అవంతి ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని రాకుండా చంద్రబాబు విషం కక్కుతున్నారని మంత్రి అవంతి ఆరోపించారు. టీడీపీ నేతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడుతోందన్నారని మండిపడ్డారు.
6నెలలు తిరక్కుండానే పవన్ గుడ్ బై చెప్పారు:
సార్వత్రిక ఎన్నికలు ముగిసి 6 నెలలు తిరక్కుండానే వామపక్షాలకు పవన్ గుడ్ బై చెప్పారని మంత్రి అవంతి అన్నారు. పవన్ కు నిలకడ లేదన్నారు. పవన్ ను అడ్డుపెట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు డ్రామాలో భాగమే బీజేపీతో పవన్ పొత్తు అన్నారు. చంద్రబాబు మాటలు విని రాజధాని రైతులు మోసపోవద్దని మంత్రి కోరారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వైసీపీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్ రాజ్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ వరకు ర్యాలీ సాగింది.