Nara Lokesh: మంగళగిరి ప్రజలకు మంత్రి లోకేశ్ కీలక విజ్ఞప్తి.. వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకానిలో 100 పకడల ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.

Minister Nara Lokesh
Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకానిలో 100 పకడల ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. చిన్నకాకాని వద్ద 7.35 ఎకరాల్లో 52.20 కోట్ల వ్యయంతో ఈ ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. 1984లో 30 పడకల ఆస్పత్రి కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు.
యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు స్థానికులు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయమని కోరారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా 100 పడకల ఆస్పత్రి ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని, ఈ ఆస్పత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ ను కూడా కలుపుతామని అన్నారు.
మంగళగిరిలో ఓడిపోయిన తరువాత నేను నియోజకవర్గం ప్రజలకు మరింత దగ్గరయ్యాను. మంగళగిరి పానకాల స్వామి గుడి కూడా మరింత అభివృద్ధి చేస్తాం. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభం అవుతాయి. అన్ని ప్రాతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
2019లో ఓడిపోయినప్పుడు నన్ను చాలా మంది కించపరిచే విధంగా మాట్లాడారు. మంగళగిరి ప్రజలు దానికి దీటుగా నన్ను గెలిపించి సమాధానం ఇచ్చారు. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో ఉండేలా చేయడమే నా లక్ష్యం అని లోకేశ్ చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు లోకేశ్ కీలక సూచన చేశారు. స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని మంత్రి లోకేశ్ కోరారు.