Smart Meters: వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు..? విద్యుత్ శాఖ మంత్రి కీలక ప్రకటన.. అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు..
స్మార్ట్ మీటర్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులతో చెప్పారు.

Smart Meters: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో స్మార్ట్ మీటర్ల అంశంపై మంత్రి అధికారులతో చర్చించారు. వ్యవసాయానికి కూడా స్మార్ట్ (కరెంట్) మీటర్లు బిగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి గొట్టిపాటి స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ఆ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజా ఆమోదం లేనిదే ఏ విషయంలోనూ ముందుకు వెళ్లకూడదని అధికారులకు సూచించారు. ప్రజల అంగీకారంతోనే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పారు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. స్మార్ట్ మీటర్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులతో చెప్పారు.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లోఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఎస్ పనుల పూర్తికి స్థానిక కాంట్రాక్టర్ల సాయం తీసుకోవాలన్నారు. పీఎం సూర్యఘర్ పైనా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులతో చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
”ప్రజల అంగీకారం లేకుండా ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు. ప్రస్తుతం పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాము. వ్యవసాయానికి వీటిని బిగించే ప్రసక్తే లేదు. స్మార్ట్ మీటర్లపై సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పీఎం సూర్యఘర్‌పైనా ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రతి నియోజకవర్గంలో 10 వేల కనెక్షన్లు ఇవ్వాలి. స్మార్ట్ మీటర్ విధానంపై స్పష్టత ఇవ్వాలి. ఈ సాంకేతికత గురించి ఏవైనా తప్పుడు సమాచారం లేదా భయాలను తొలగించాలి” అని మంత్రి గొట్టిపాటి అధికారులను ఆదేశించారు.