ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క : కొడుకు కటౌట్‌ను వదిలిన బొత్స

ఇన్నాళ్లు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క : కొడుకు కటౌట్‌ను వదిలిన బొత్స

Updated On : December 25, 2020 / 8:47 PM IST

Minister Satyanarayana son Sandeep Babu : ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడంతా యంగ్ జనరేషన్‌దే హవా. రాజకీయాల్లో రాణిస్తున్న నేతల పిల్లలు …పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వకపోతే రాజకీయ వారసత్వం అక్కడితో నిలిచిపోతుంది. వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు… ముందుకొస్తున్నాడు ఆయన తనయుడు డాక్టర్ సందీప్‌బాబు. తన వారసుడును తెరపైకి తెచ్చి సంచలనానికి తెరలేపారు మంత్రి బొత్స.

నలుమూలలా ప్లెక్సీలు : –
ఎప్పుడూ లేనిది జిల్లా వ్యాప్తంగా సందీప్ ప్లెక్సీలు దర్శనమిస్తుండటం రాజకీయ అరంగ్రేటానికి సంకేతమంటున్నారు. దేనికైనా సమయం సందర్భం ఉండాలంటారు. సత్తిబాబు కూడా అంతే. సరిగ్గా టైం చూసి తన కొడుకు కటౌట్ ను బయటకు వదిలారు. సందీప్‌బాబు పుట్టినరోజు సందర్భంగా జిల్లా నలుమూలలా ఫ్లెక్సీలతో నింపేశారు. ఇది చూసిన విజయనగరం జిల్లా వాసులు.. సత్తిబాబు పెద్ద ప్లాన్‌తోనే ఇదంతా చేస్తున్నాడని గుసగుసలాడుకోవడం మొదలెట్టారు. రోజులు గడిచేకొద్దీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమూ అయిపోయింది.

తెరపైకి వచ్చిన సందీప్ : –
మంత్రి బొత్సకు ఓ కొడుకున్నాడని జనాలకి ఎరుకే. ఆ కొడుకు వైద్య విద్య పూర్తి చేసి, ఎక్కడో డాక్టర్‌గా పనిచేస్తున్నాడని కొంతమందికే తెలుసు. పేరు సందీప్‌ అని సన్నిహితులకు తప్ప ఎవ్వరికీ తెలియదట. సత్తిబాబు రాజకీయ వారసుడిగా ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్న శ్రీను వస్తాడని అనుకున్నారు. ఇప్పటికే చాలా కాలం నుంచి ఒక రకంగా బొత్సా ఫ్యామిలీలో మంత్రి బొత్సా తర్వాత రాజకీయంగా చక్రం తిప్పుతున్నది చిన్న శ్రీనే.. కానీ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా..సందీప్‌ను తెరపైకి తేవడంతో టాక్ ఆఫ్ ద జిల్లా అయ్యింది..

రక్తదానం చేసిన డా.సందీప్ : –
వైసీపీలో కీలక నేతగా చక్రం తిప్పుతున్న బొత్సా ..కొడుకు ఫస్ట్ లుక్‌ను రిలీజ్‌ చేయడమే కాదు..సందీప్‌ను అమరావతి తీసుకెళ్లి సీఎం జగన్‌కు పరిచయం చేసేశారు. అంతేకాదు.. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా సందీప్‌ రక్తదానం కూడా చేసేసి తన అభిమానం చాటుకున్నాడు. విజయనగరం ఫ్లెక్సీల్లో వెలిగిపోతున్న డాక్టర్‌ సందీప్‌బాబు.. ప్రస్తుతం విశాఖలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. మరి భవిష్యత్తు రాజకీయాల్లో బొత్స వారసుడిగా ఎలా రాణిస్తాడో చూడాలి.