Byreddy Siddharth Reddy: మంత్రి టీజీ భరత్ పరువు నష్టం కేసు.. పోలీసుల విచారణకు హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
మంత్రి టీజీ భరత్ దాఖలు చేసిన కేసులో వైఎస్సార్సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(Byreddy Siddharth Reddy) కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
minister tg bharath defamation case byreddy siddharth reddy attends kurnool police investigation
- మంత్రి కేసులో బైరెడ్డి విచారణకు హాజరు
- రూ.45 కోట్ల ముడుపుల ఆరోపణలపై కేసు
- కర్నూలు త్రీటౌన్ పోలీసుల నోటీసుల కలకలం
Byreddy Siddharth Reddy: ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో వైఎస్సార్సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy)కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత నెలలో నమోదైన ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు 41 సీఆర్పీసీ (ప్రస్తుత చట్టాల ప్రకారం) నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిపించినట్లు సమాచారం.
గత మే 14వ తేదీన కర్నూలు కలెక్టరేట్ ముందు జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి టీజీ భరత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక ఫార్మా కంపెనీ వ్యవహారంలో మంత్రి లోకేష్‌కు తెలియకుండా టీజీ భరత్ రూ. 45 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి భరత్, తన పరువుకు భంగం కలిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంత్రి ఫిర్యాదును స్వీకరించిన త్రీటౌన్ పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై BNS సెక్షన్స్ 351(2), 352, 353(2), 356(1), 356(2) కింద క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే ఆయన పోలీసుల ముందుకు వచ్చారు. ఈ రాజకీయ ఆరోపణల ఉదంతం ప్రస్తుతం కర్నూలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
