చంద్రబాబుకి బిగ్ షాక్ : ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

మూడు రాజధానుల బిల్లు చర్చకు వచ్చిన వేళ శాసనమండలిలో చంద్రబాబుకి బిగ్ షాక్ తగిలింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ(జనవరి 21,2020) మండలి సమావేశానికి డొక్కా గైర్హాజరయ్యారు. ఆయన సభకు ఎందుకు రాలేదని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇంతలోనే డొక్కా షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు డొక్కా చెప్పారు.
గత ఎన్నికల్లో పత్తిపాడు నుంచి డొక్కా పోటీ చేశారు. మరోవైపు మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి సైతం మండలికి రాలేదు. అనారోగ్యం కారణంగా మండలికి రావడం లేదని ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నాబాయి కూడా మండలికి హాజరుకాలేదు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సభలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
* శాసనమండలిలో చంద్రబాబుకి బిగ్ షాక్
* ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా
* ఈ రోజు మండలికి హాజరుకాని డొక్కా
* పదవికి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబుకి లేఖ రాసిన డొక్కా
* మూడు రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నా-డొక్కా
* అమరావతి రాజధాని విడిపోతున్నందుకు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా-డొక్కా
* భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం
ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగానే తాను పదవికి రాజీనామా చేశానని డొక్కా చెప్పడంపై టీడీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే వ్యతిరేకించే వారే అయితే.. మండలిలో ఓటింగ్ లో పాల్గొని మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఓటు వేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అర్ధాంతరంగా ఇలా రాజీనామా చేయడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారపక్షంతో డొక్కా ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా సరికొత్త డ్రామా కాదు కదా అని డౌట్స్ రైజ్ చేస్తున్నారు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ శానససభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లు ఇవాళ శాసనమండలి ముందుకు వచ్చింది. మండలిలో టీడీపీకి సంఖ్యా బలం ఎక్కువ. ఆ పార్టీకి 34మంది(28 టీడీపీ ఎమ్మెల్సీలు+ ఐదుగురు నామినేటెడ్ సభ్యులు+ ఒక ఇండిపెండెంట్) ఎమ్మెల్సీలు ఉన్నారు. వైసీపీకి కేవలం 9మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డొక్కా రాజీనామా చేయడం, శమంతకమణి మండలికి హాజరుకాకపోవడం టీడీపీ శ్రేణులను ఆందోళనలో పడేశాయి.
ఏపీ శాసనమండలి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పాలనా వికేంద్రీకరణపై చర్చకు ముందే నెంబర్ గేమ్ మొదలైంది. 58మంది సభ్యులున్న పెద్దల సభలో సంఖ్యాపరంగా ప్రతిపక్షానిదే(టీడీపీ) ఆధిపత్యం. టీడీపీకి 28మంది సభ్యులు ఉండగా… అధికార పక్షం వైసీపీకి కేవలం 9మంది సభ్యులే ఉన్నారు. ఇక.. బీజేపీకి ఇద్దరు సభ్యులుండగా… ముగ్గురు ఇండిపెండెంట్లు, 8మంది నామినేటెడ్ సభ్యులు, ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలున్నారు. మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
టీడీపీకి 28మంది సభ్యులతోపాటు.. నామినేటెడ్ సభ్యుల్లోని ఐదుగురు ఎమ్మెల్సీలు, ఇండిపెండెంట్లలోని ఓ ఎమ్మెల్సీ టీడీపీకి మద్దతిస్తున్నారు. దీంతో మొత్తంగా ఆ పార్టీ బలం 34గా ఉంది. ఇక గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణరాజు వైసీపీలోనే ఉండటంతో ప్రభుత్వ బలం 10కి చేరింది. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు, ఇండిపెండెంట్లలోను ఇద్దరు సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదు. అయితే.. వీరంతా కలిపినా వైసీపీకి 14మంది సభ్యుల బలం మాత్రమే దక్కుతోంది. కానీ… బిల్లును గట్టెక్కించాలంటే అధికార పక్షానికి మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అవసరం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఐదుగురున్నా వారికి పార్టీలతో సంబంధం లేదు. అందుకే వీరు తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో బిల్లుల ఆమోదంపై అనుమానాలు నెలకొన్నాయి.
మండలిలో టీడీపీదే ఆధిపత్యమైనా…. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేయడం, శమంతకమణి సభకు గైర్హాజరవడం వంటి పరిణామాలు ఆ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. మరోవైపు.. బిల్లుల ఓటింగ్ సమయానికి ఏం జరుగుతుందన్నది సస్పెన్స్‌గా మారింది.