కేరళలో రుతుపవనాలు ఎఫెక్ట్.. తుఫాన్ హెచ్చరికలు.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలు

  • Published By: vamsi ,Published On : June 2, 2020 / 01:37 AM IST
కేరళలో రుతుపవనాలు ఎఫెక్ట్.. తుఫాన్ హెచ్చరికలు.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలు

Updated On : June 2, 2020 / 1:37 AM IST

కరోనా కారణంగా కాలుష్యం తగ్గడం కారణమో ఏమో కానీ, అంచనాలకు అనుగుణంగా వాతావరణం మార్పులు జరుగుతున్నాయి. వాస్తవానికి మరికొంతకాలం సమయం పడుతుంది అని అనుకున్నప్పటికీ అనుకున్న సమయానికే నైరుతీ రుతుపవనాలు కేరళను జూన్ 1న తాకాయి. నైరుతి రుతుపవనాలు ఆ రాష్ట్రంలో ఇప్పటికే తొలకరి జల్లులు కురిపించాయి. 

ప్రస్తుతం కేరళ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఈసారి నైరుతి రుతుపవనాలు 4 నెలలపాటూ చురుగ్గా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే కాస్త ఎక్కువగా వానలు పడుతాయి. దక్షిణ భారత్‌లో మాత్రం సాధారణ వర్షాలు కురుస్తాయని, తూర్పు, ఈశాన్య భారత్‌లో మాత్రం తక్కువ వానలు పడతాయని చెప్పారు. మొత్తంగా సెప్టెంబర్ నాటికి 75 శాతం వానలు కురుస్తాయి అంటున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజారాత్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జూన్ 3 సాయంత్రం నాటికి అది భూమిపైకి వస్తుందని అంటున్నారు. ఆ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వెల్లడించారు. ఆ రెండు రాష్ట్రాలతోపాటూ గోవాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, ముంబైలో కొద్దిపాటి వానలు పడతాయని అన్నారు.

వాతావరణ శాఖ అధికారుల సూచనలతో గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. NDRF బృందాల సహాయంతో ఆరు జిల్లాల్లోని తీర ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా 23 ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపింది. తుఫాను కారణంగా… నైరుతి రుతుపవనాల విస్తరణ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు అధికారులు. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం మరో వారం పట్టే అవకాశం ఉంది. 

దేశానికి సాధారణ వర్షపాతం వచ్చే అవకాశం 41 శాతం ఉందని, లోటు వర్షపాతం కేవలం ఐదు శాతం మాత్రమే ఉంటుందని ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి ఉండటంతో తెలంగాణలో రెండ్రోజులపాటూ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఏపీలో కూడా రాబోయే మూడు రోజులపాటు చిన్నపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Read: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు