WhatsApp Governance : గుడ్ న్యూస్.. వాట్సాప్ గవర్నెన్స్ లో త్వరలో 350 రకాల ప్రభుత్వ సేవలు..
వాట్సాప్ గవర్నెన్స్‌కు అనూహ్య స్పందన ఉందని.. ఈ సేవలను మరింత విస్తృత పరచాలని సీఎం చంద్రబాబు సూచించారు.

WhatsApp Governance : సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖలపై ప్రజంటేషన్లు ఇచ్చారు. 3వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కలెక్టర్ల సదస్సు అజెండా, చర్చలను ఈసారి భిన్నంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రాధామ్యాలు, లక్ష్యాలు, సాధించిన ప్రగతి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరిస్తూ సీఎం ప్రసంగం సాగింది.
శాఖల మధ్య మరింత సమన్వయం తీసుకొచ్చేలా, విధ్వంసమైనటు వంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టేలా ఏపీ సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పాలనతో పాటు అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం చేశారు.
”విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకువెళ్లడంలో కలెక్టర్లు కీలకం. జిల్లా ఎగ్జిక్యూటివ్‌గా విస్తృత అధికారాలు, బాధ్యతలు కలెక్టర్లకు ఉన్నాయి. ప్రజల అర్జీల పరిష్కారంలో మరింత చొరవ చూపాలి. ఈ ఏడాది 17 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పని చేయాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులు, అధికారులు మరింత బాధ్యతగా ఉండాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read : ఏపీలో ఉగాది నుంచి కొత్త పథకం.. ఎవరికి ప్రయోజనం, లక్ష్యం ఏంటి..
సీఎం ప్రసంగం తర్వాత స్వర్ణాంధ్ర 2047 విజన్‌పై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ”ఏడాదికి 15 శాతం వృద్ధి సాధనతోనే స్వర్ణాంధ్ర-2047 సాకారం. 2047 నాటికి రూ.308 లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీ చేరాలనేది లక్ష్యం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షల సాధనకు పది సూత్రాలతో ప్రణాళిక. 60 శాతం పట్టణీకరణ, నిరుద్యోగిత తగ్గించడం.. రూ.39.12 లక్షల కోట్ల ఎగుమతులు సాధించడం లక్ష్యాలు. 2029 నాటికి తలసరి ఆదాయం రూ.5,42,985. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, మున్సిపాలిటీ, సచివాలయం స్థాయిలో ‘విజన్ యాక్షన్ ప్లాన్’ పై పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం రూ.2,19,234 కాగా.. అనంతపురం జిల్లాలో రూ.2,33,521, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రూ.1,93,763గా ఉంది.
కరవు పీడిత ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా పరిగణించబడే అనంతపురం జిల్లా కోనసీమ కంటే తలసరి ఆదాయంలో ముందుందని చంద్రబాబు అన్నారు. హార్టికల్చర్, సెరికల్చర్ కారణంగా రాయలసీమ జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. తలసరి ఆదాయం పెరుగుదలకు కారణాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను ఇతర జిల్లాల్లో అమలు చేయాలని చెప్పారు.
Also Read : తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వాళ్లకు స్కీం పక్కా..
వాట్సాప్ గవర్నెన్స్‌పై ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 210 సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 15 రోజుల్లో వీటిని 350కు పెంచుతామని వివరించారు. వాట్సాప్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌కు అనూహ్య స్పందన ఉందని.. ఈ సేవలను మరింత విస్తృత పరచాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ప్రజలే ఫస్ట్ విధానంలో భాగంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రామాలపై ఫీడ్ బ్యాక్ మెకానిజం, ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి విధానాల ద్వారా లబ్దిదారుల అభిప్రాయాల సేకరించనున్నారు. 22 ప్రభుత్వ సేవల్లో పాజిటివ్ పర్సెప్షన్‌పై సర్వే చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి వారం నాలుగు సర్వీసులపై సమీక్ష నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు, దాని ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు.