Vemireddy Prabhakar Reddy: టీడీపీ ఎంపీ సంచలన నిర్ణయం.. 400 కోట్ల రూపాయలతో.. ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న ఆలోచన విరమణ…
సొంత డబ్బుతో నేను సేవ చేస్తుంటే నాపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు.

Vemireddy Prabhakar Reddy: నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ పెట్టాలనుకున్న ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన ప్రకటించారు. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పించాలని అనుకున్నానని, 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఆ మేరకు పనులు చేద్దామని ప్రభుత్వాన్ని అడిగానని ఆయన తెలిపారు. అక్రమ మైనింగ్ లేకుండా న్యాయబద్ధంగా క్వార్ట్జ్ పరిశ్రమ నెలకొల్పాలని అనుకున్నట్లు వెల్లడించారు.
సొంత డబ్బుతో నేను సేవ చేస్తుంటే నాపైనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని ఎంపీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. వెయ్యి మందికి ఉపాధి కల్పించాలని అనుకుంటే నాపైనే ఆరోపణలు చేస్తారా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నేను ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచన విరమించుకుంటా అని వెల్లడించారు.
ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలని వస్తే వారికి సహకరిస్తానని చెప్పారాయన. అక్రమ క్వార్ట్జ్ రవాణా చేస్తే ఒప్పుకోము అని ప్రభుత్వం గతంలోనే అందరికీ చెప్పిందని గుర్తు చేశారు. రేపటి నుంచి క్వార్ట్జ్ అంశంలోకి తనను లాగితే వాళ్ళ ఖర్మకి వదిలేస్తున్నా అని చెప్పారు. 2024, 2025 సంవత్సరాలలో 19,600 టన్నుల క్వార్ట్జ్ ని ఎగుమతి చేశామన్నారు. ”సొంత డబ్బుతో సేవ చేసే మేము 19 వేల టన్నులు ఎగుమతి చేస్తే ఎంత దోచేస్తాను? ఎన్ని కోట్లు సంపాదిస్తాను? నాకు అంత అవసరం ఏముంది? ఈ మాటలు పడలేక ఈ వ్యాపారాలు ఆపేస్తున్నా. 2023లో సోకాల్డ్ నేతలు 9,65,000 టన్నుల క్వార్ట్జ్ ని ఎగుమతి చేశారు” అని ఆయన ఆరోపించారు.