రాజకీయాల్లోనే ఉంటా.. ప్రజల దగ్గరకెళ్లి తేల్చుకుంటా: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

39 అక్రమ కేసులు, కోట్ల రూపాయిల ఖర్చు ఇవేమీ కాపాడలేకపోయాయి. మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్‌ని లాగేసుకున్నారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాల్లోనే ఉంటా.. ప్రజల దగ్గరకెళ్లి తేల్చుకుంటా: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

Nallamilli Ramakrishna Reddy: మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్‌ని లాగేసుకున్నారని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన సీటుకు బీజేపీ ఇవ్వడంతో ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తనకు టికెట్ లేకుండా చేయడం పట్ల మనోవేదన చెందారు.

ఐదేళ్ళపాటు రాక్షసులతో ప్రత్యక్ష యుద్దం. 39 అక్రమ కేసులు, భౌతిక దాడులు, జైలు జీవితం, హత్యకు సుఫారీ, 400 మంది కార్యకర్తలపై 180కి పైగా కేసులు, లాఠీ దెబ్బలు, 24×7 ప్రజల కోసమే పోరాటం, కోట్ల రూపాయిల ఖర్చు ఇవేమీ కాపాడలేక పోయాయి. మాట మాత్రం కూడా చెప్పకుండా ఇచ్చిన టికెట్‌ని లాగేసుకున్నారని ట్వీట్ చేశారు.

కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడతా
గురువారం ఉదయం ఆయన 10టీవీతో మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయం మేరకు 4 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వైసీపీ కుట్ర వల్లే బీజేపీకి టికెట్ కేటాయించారని ఆరోపించారు. ”నన్ను నా కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేయాలని చూస్తున్నారు. నా చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటాను. అధికారం లేకపోయినా నిరంతరం పార్టీ కోసమే పనిచేశాను. చంద్రబాబు అనేకసార్లు ఆఫీసుకు పిలిపించి అభినందించారు. ఎన్ని సార్లు సర్వే చేసిన నేను అత్యధిక మెజారిటీతో గెలుస్తానని వచ్చింది. నా ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ చెప్పిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుంటాను. కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటాన”ని అన్నారు.

Also Read: ధర్మవరం టికెట్ ఆయనకే- ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే

ప్రజల దగ్గరకెళ్లి తేల్చుకుంటా..
కాగా, కార్యకర్తలతో ఈ ఉదయం ఆయన సమాశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయంచారు. ”ఐదేళ్ళపాటు నా ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టాను. నా కుటుంబాన్ని ఫణంగా పెట్టాను. ఆర్ధిక పరిస్దితిని ఫణంగా పెట్టాను. నాకు అన్యాయం జరిగింది. కుటుంబ సమేతంగా ప్రజల దగ్గరకే వెళ్ళి తేల్చుకుంటా. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాన”ని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు అనపర్తి టికెట్ బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మద్దతుదారులు నిరసనలు కొనసాగిస్తున్నారు. టీడీపీకే సీటు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.