హైదరాబాద్‌లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసిన మంగళగిరి పోలీసులు
ఈ కేసులో నందిగం సురేశ్ సహా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్..

Nandigam Suresh
బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్‌ను మంగళగిరి గ్రామీణ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సురేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేశ్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేసి, ఆయనను గుంటూరు జిల్లాకు తరలిస్తున్నారు. ఆయనను ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు.
కాగా, గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నందిగం సురేశ్ సహా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్ కోసం పోలీసులతో అధికారులు బృందాలను ఏర్పాటు చేశారు.
నందిగం సురేశ్‌ను అరెస్టు చేసేందుకు నిన్న పోలీసులు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు పోలీసులు వేచిచూసి వెనుదిరిగారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి ఆయన ఆచూకీ గుర్తించినట్లు తెలుస్తోంది.
Also Read: విజయవాడలో మళ్లీ వాన.. ఆందోళనలో ప్రజలు