భోగి మంటల్లో బోస్టన్ రిపోర్ట్‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్మించేందుకు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్‌లను భోగి మంటల్లో తగలెయ్యాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రాబాబు ఇచ్చిన పిలుపు మేరకు.. తెలుగుదేశం నాయకులు నేతలు ఆ రిపోర్ట్‌లను భోగి మంటల్లో కలుస్తున్నారు. విశాఖను రాజధానిగా సూచించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. జీఎన్‌రావు కమిటీ రిపోర్టులను భోగి మంటల్లో కాల్చివేశారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని ప్రైవేట్ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలోనే రిపోర్ట్‌లను భోగి మంటల్లో కాల్చారు తెలుగుదేశం, జేఏసీ నేతలు.. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్‌రావు, దేవినేని ఉమ, బోడె ప్రసాద్, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, ఐకాస కన్వీనర్ ఆళ్ల శివారెడ్డి, కోకన్వీనర్లు గద్దె తిరుపతిరావు, ఆర్.ఎల్.స్వామి, కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జనసేన నాయకురాలు రజని, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ హాజరయ్యారు, పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో కూడా భోగి మంటలు ఏర్పాటు చేసి జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ నివేదిక ప్రతులను అందులో వేసి నిరసనలు తెలుపుతున్నారు. ఈ సంధర్భంగా మన సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఉన్న చెత్తను అంతా క్లీన్ చేసి చెత్తను భోగి మంటల్లో వేస్తామని, అలాగే ఈ చెత్త రిపోర్ట్ లు భోగిలో వేశామని అన్నారు చంద్రబాబు.