పాడె మోసిన నారా లోకేష్ : 10 మంది రైతులు చనిపోతే స్పందించరా

  • Published By: madhu ,Published On : January 8, 2020 / 02:41 PM IST
పాడె మోసిన నారా లోకేష్ : 10 మంది రైతులు చనిపోతే స్పందించరా

Updated On : January 8, 2020 / 2:41 PM IST

కృష్ణయ్యపాలెంలో గుండెపోటుతో చనిపోయిన కృపానందం అంతిమయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడె మోశారు. కృపానందం కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని తరలిస్తే..భవిష్యత్ ఏమవుతుందనే ఆందోళనతోనే కృపానందానికి గుండెపోటు వచ్చిందని, 10 మంది రైతులు చనిపోతే..అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ స్పందించరా అంటూ ప్రశ్నించారు.

 

చనిపోయిన రైతులు పెయిడ్ ఆర్టిస్టులా కనిపిస్తున్నారా అన్నారు. కృష్ణా, గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సీఎంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై అవగాహన లేని వారు హై పవర్ కమిటీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో తిరగాలంటే..సీఎం, మంత్రులు ఎందుకు భయపడుతున్నారు ? నిరసన తెలిపేందుకు టెంట్‌ల నిరాకరణపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. 

మూడు రాజధానులంటూ సీఎం చేసిన ప్రకటన, GN RAO ఇచ్చిన నివేదికపై రాజధాని వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇలా 22 రోజుల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై దాడి జరగడం కలకలం రేపింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.

 

గన్ మెన్‌పై దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రాజధానిలో ఆందోళన చేస్తున్న వారికి టీడీపీ మద్దతు ప్రకటిస్తూ..నిరసనల్లో పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొత్తంగా రాజకీయాలు మరింత హీటెక్కాయి. 

Read More : బస్సు యాత్ర : అడ్డుకున్న పోలీసులు..కన్నెర్ర చేసిన బాబు